IPL 2023 Viewership: జార్ఖండ్ డైనమైట్  మహేంద్ర సింగ్ ధోని సిక్సర్లా మజాకా..  వింటేజ్ ధోనిని గుర్తుకు చేస్తూ  బుధవారం  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో  ధోని  విధ్వంసాలకు జియో సినిమా వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేక్ అయ్యాయి.  ఈ మ్యాచ్  జరుగుతున్న క్రమంలో 1 కోటి, కోటిన్నర  వ్యూస్  ఉండగా ఆఖర్లో  ధోని బ్యాటింగ్ కు  వచ్చి  బాదుడు మొదలెట్టాక   వ్యూయర్‌షిప్ ఏకంగా  2 కోట్లు దాటింది.  ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. 


రాజస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా శాంసన్ సేన నిర్దేశించిన 176 పరుగులను  ఛేదించే క్రమంలె చెన్నై  ఆరంభంలో  ధాటిగానే ఆడినా తర్వాత  అశ్విన్, చాహల్,  జంపాల స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది.  18 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే చేసింది 136 పరుగులే.  ఆఖరి రెండు ఓవర్లలో 40 రన్స్ చేయాలి.  అప్పటిదాకా  జియో సినిమాలో రియల్ టైమ్ వ్యూస్ 1.8 కోట్ల వద్ద ఉంది. అప్పటికే టైమ్  11 దాటింది. 


జేసన్  హోల్డర్ వేసిన  19వ ఓవర్లో  జడేజా  ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించాడు. దీంతో జియో సినిమాలో చూసేవారి  సంఖ్య కూడా  2 కోట్లకు  పెరిగింది.   ఇక చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోని  బ్యాటింగ్.  ఆ ఓవర్లో  21 పరుగులు కావాలి. ఐపీఎల్ఖ-16లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ తప్పదనిపించింది. దానికి  అనుగుణంగానే తాలా.. 2, 3 బంతుల్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు. ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావించిన అభిమానులు రాత్రి 11.30 గంటలు దాటినా మొబైల్ తెరల ముందు కళ్లప్పగించి చూశారు. అప్పుడు జియో వ్యూయర్ షిప్  ఏకంగా  2.2 కోట్లకు తాకింది.  


 






అయితే సందీప్ శర్మ చివరి మూడు బంతులను తెలివిగా వేసి  చెన్నై విజయాన్ని దూరం చేశాడు.  మ్యాచ్  పోయినా  జియో వ్యూయర్ షిప్  లో మాత్రం  ఇవే హయ్యస్ట్ వ్యూస్.  41 ఏండ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి.. అదీగాక అంతర్జాతీయ  క్రికెట్ ను వదిలేసి మూడేండ్లు గడిచినా.. మునపటిలా షాట్లు కొడతాడో లేదోనన్న  అనుమానాల ఊగిసలాటలో కూడా ధోని  మీద  తమిళ తంబీలతో పాటు ఐపీఎల్ అభిమానులకు ఉన్న నమ్మకానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి.  దటీజ్ ధోని.. 


జియో సినిమాలో ఐపీఎల్ - 2023  హయ్యస్ట్ వ్యూస్ రికార్డు.. 


- సీఎస్కే వర్సెస్ రాజస్తాన్ : 2.2 కోట్లు
- ఆర్సీబీ వర్సెస్ లక్నో : 1.8 కోట్లు 
- ముంబై వర్సెస్ ఢిల్లీ : 1.7 కోట్లు (లాస్ట్ ఓవర్ థ్రిల్లర్)
- సీఎస్కే వర్సెస్ లక్నో : 1.7 కోట్లు (ఇది కూడా ధోని.. మార్క్ వుడ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టినప్పుడే) 
- సీఎస్కే వర్సెస్ గుజరాత్ : 1.6 కోట్లు  


ఐపీఎల్‌లో ఇప్పటివరకు హయ్యస్ట్ వ్యూస్‌కు సంబంధించిన రికార్డు  2019 సీజన్ లో నమోదైంది.  ఈ సీజన్ లో భాగంగా  ముంబై - చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో రియల్ టైమ్ వ్యూస్ 1.8 కోట్లకు తాకింది.  అప్పుడు  ఐపీఎల్ మ్యాచ్ లు హాట్ స్టార్  లో వచ్చేవి.  కానీ ఈ రికార్డును  జియో  చెల్లాచెదురు చేస్తున్నది. ఈ సీజన్ లో శని, ఆదివారాలతో పాటు మిగతా రోజుల్లో కూడా మ్యాచ్ లలో రియల్ టైమ్ వ్యూస్ ఏకంగా కోటిని దాటుతున్నాయి.  హాట్ స్టార్ లో మ్యాచ్ లు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి.   కానీ జియోలో ఐపీఎల్ ఉచితంగా ప్రసారమవుతున్నది.