David Warner In IPL: ఐపీఎల్ -16లో ఢిల్లీ క్యాపిటల్స్ అపజయాల పరంపర కొనసాగుతోంది.  మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా   ముంబై ఇండియన్స్ తో  జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ.. చివరి బంతికి ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ లో  ఢిల్లీ ఓడినా ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు.  ఈ లీగ్ లో 600 బౌండరీలు బాదిన తొలి విదేశీ క్రికెటర్ గా  రికార్డు పుటల్లో నిలిచాడు. 


ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ లో వార్నర్.. 47 బంతుల్లో  6 బౌండరీల సాయంతో  51 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో  అతడు  రెండో బౌండరీ  కొట్టగానే ఐపీఎల్ లో  వార్నర్ భాయ్ సాధించిన బౌండరీల కౌంట్  600 దాటింది.  ఐపీఎల్ లో క్రిస్ గేల్, డివిలియర్స్ వంటి విదేశీ క్రికెటర్లు చాలాకాలంగా ఆడినా  ఈ ఫీట్ ను అందుకోలేకపోయారు.  మొత్తంగా ఈ జాబితాలో  టీమిండియా వెటరన్ బ్యాటర్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు  సారథిగా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధావన్ ఐపీఎల్ లో ఏకంగా 728 బౌండరీలు  సాధించి ఎవరికీ  అందనంత దూరంలో నిలిచాడు. ఈ జాబితాను ఒకసారి చూద్దాం.  


ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు సాధించిన టాప్-5 వీరులు : 


- శిఖర్ ధావన్ : 728 బౌండరీలు (144 సిక్సర్లు)
- డేవిడ్ వార్నర్ : 604 బౌండరీలు (216 సిక్సర్లు) 
- విరాట్ కోహ్లీ : 591 బౌండరీలు (227 సిక్సర్లు) 
- రోహిత్ శర్మ : 528 బౌండరీలు (245 సిక్సర్లు) 
- సురేశ్ రైనా : 506 బౌండరీలు (203 సిక్సర్లు)


ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో  6వేల పరుగుల మైలురాయిని  అధిగమించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో కూడా వార్నర్.. 6 వేల  రన్స్ పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్ గా ఉండటం గమనార్హం. 


ఐపీఎల్ లో టాప్ - 5 పరుగులు సాధించిన ఆటగాళ్లు : 


- విరాట్ కోహ్లీ : 226 మ్యాచ్ లలో 6,788 పరుగులు 
- శిఖర్ ధావన్ :  209 మ్యాచ్ లలో 6, 469 
- డేవిడ్ వార్నర్ : 166 మ్యాచ్ లలో 6,090
- రోహిత్ శర్మ : 230  మ్యాచ్ లలో 5,966 
- రైనా : 205 మ్యాచ్ లలో 5,528  


ఇక ఢిల్లీ  - ముంబై  మ్యాచ్ విషయానికొస్తే  ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  వార్నర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో  172 పరుగులకే ఆలౌట్ అయింది.  వార్నర్ తో పాటు అక్షర్ పటేల్ (54) కూడా రాణించాడు.  గత మూడు మ్యాచ్ లలో మాదిరిగానే ముంబైతో పోరులో కూడా ఢిల్లీ టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం ముంబై.. 20 ఓవర్లలో   173 పరుగులు చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ  (65), తిలక్ వర్మ (41) లు రాణించగా ఆఖర్లో  టిమ్ డేవిడ్ (13 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్)లు ముంబైకి ఉత్కంఠ విజయాన్ని అందించారు.  ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది నాలుగో పరాజయం కాగా ముంబైకి తొలి విజయం.  ఢిల్లీ తమ తర్వాతి మ్యాచ్ ను ఈనెల 15 బెంగళూరుతో ఆడనుంది.