Suryakumar Golden Duck: ‘క్రికెట్ చాలా క్రూరమైన ఆట’ అంటారు ఈ గేమ్ గురించి అ నుంచి క్ష వరకు తెలిసిన  పండితులు.  నాలుగైదు మంచి ఇన్నింగ్స్‌తో ఒక ఆటగాడిని  ఆకాశానికి ఎత్తే ఈ  క్రేజీ గేమ్.. అవే నాలుగైదు మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన  చేయకుంటే అదే ఆకాశం నుంచి జాలి, దయ చూపకుండా అధో పాతాళానికి పడేస్తుంది. ప్రస్తుతం టీమిండియా టీ20 స్టార్ బ్యాటర్, ఈ ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ రెండో దశను ఎదుర్కుంటున్నాడు.  నాలుగైదు నెలల క్రితం  ‘సూర్య తోపు దమ్ముంటే ఆపు’ అని పొగిడిన నోళ్లే  ‘‘అతడు సూర్యకుమార్ కాదు ‘శూణ్య’కుమార్’’ అని నిందిస్తున్నాయి.   


సూర్య  టీమిండియాకు ఆడేది వన్డేలు, టీ20లకే.  వన్డేలలో కూడా అతడిప్పటికీ పూర్తిస్థాయిలో నమ్మదగ్గ  రెగ్యులర్ ప్లేయర్ కాలేదు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లు గాయపడితే  సూర్య తుది జట్టులోకి వస్తున్నాడు. అయితే టీ20లలో మాత్రం  భారత జట్టుకు ఇప్పటికీ అతడే నెంబర్ వన్. కానీ  గడిచిన కొన్నాళ్లుగా  సూర్య ఆట.. వైట్ బాల్ క్రికెట్ లో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మరీ ముఖ్యంగా గడిచిన  నెలన్నరలో సూర్య.. క్రీజులో ఉండి పరుగులు సాధించేదానికంటే ‘సున్నాలు చుట్టేందుకే’  పరిమితమవుతున్నాడు. 


లెక్కలు దారుణం.. 


వన్డేలలో సూర్య ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో  సూర్య వరుసగా  మూడు మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అంతకుముందు  కూడా దాదాపు ఇంతే. గత పది వన్డే ఇన్నింగ్స్ లలో  సూర్య చేసిన స్కోర్లు చూస్తే.. 0, 0, 0, 14, 0, 31, 4, 6, 34, 4  (మొత్తం కలిపినా 93 మాత్రమే) దారుణంగా విఫలమవుతున్నాడు.   ఇక తాజాగా ఐపీఎల్ -16 లో ముంబై మూడు మ్యాచ్ లు ఆడింది. ఈ మూడింటిలో  సూర్య స్కోర్లు ఇవి..  15, 1, 0. 


- గడిచిన ఏడు వన్డేలు, ఐపీఎల్-16 లో మూడు మ్యాచ్‌లలో కలుపుకుని గత  పది ఇన్నింగ్స్ లలో  సూర్య చేసిన పరుగులు  0, 1, 15, 0, 0, 0, 14, 0, 31 , 4.. మొత్తం కూడినా  65 పరుగులే. 


గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో  టీ20లలో  సూర్య ఆడిన ఆటకు ఇప్పటి ఆటకు సంబంధమే లేదు.  క్రీజులోకి వచ్చి  ఓ ఇరవై, ముప్పై పరుగులు చేసినా అతడిపై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కావేమో. కానీ మరీ దారుణంగా అతడు క్రీజులోకి వచ్చి తాను ఎదుర్కున్న మొదటి బంతికే నిష్క్రమించడం  అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. 


 






టీమిండియాకూ కష్టాలే..!


సూర్య ఆట ఇలాగే కొనసాగితే అది అతడికి వ్యక్తిగతంగానే గాక  టీమిండియాకూ  ఆందోళనకరమే.  ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది.  ఈ మెగా ట్రోఫీకి  భారత జట్టుకు సూర్య చాలా కీలకం. అసలే  భారత్ ను మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్  సర్జరీకి వెళ్తే అతడు  ఎప్పుడు జట్టుతో చేరుతాడు..? అనేదాన్లో స్పష్టత లేదు.  రిషభ్ పంత్  కూడా వన్డే వరల్డ్ కప్ వరకు గాయం నుంచి కోలుకుంటాడా..? అనేదీ అనుమానమే. కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలతో పాటు సూర్య కూడా ఉంటే అప్పుడు భారత బ్యాటింగ్ లోతు మరింత బలంగా ఉంటుంది. 


ఏ ఆటగాడికైనా తన కెరీర్ లో క్షీణ దశ  సర్వ సాధారణమే. దానికి సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ ఎవరూ అతీతులు కాదు. ఈ విషయం సూర్యకు తెలియందీ కాదు.  టెక్నిక్ ను మార్చుకునేంత లోపాలు ఏమీ లేవని  సూర్యకు రవిశాస్త్రి, ఏబీ డివిలియర్స్ వంటి వాళ్లు సూచిస్తున్నారు. కావాల్సిందల్లా ఒక్క మంచి ఇన్నింగ్స్  కోసం వేచి ఉండటమే. ఆ ‘ఒక్క ఛాన్స్’తో మళ్లీ ఏడాది క్రితం నాటి ‘మిస్టర్ 360’ వస్తే అప్పుడిక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు.  తన తప్పులను తెలుసుకుని   సూర్య త్వరలోనే మునపటి బాట పట్టాలని  టీమిండియా అభిమానులు  కోరుకుంటున్నారు.