Injured Players In CSK: ఐపీఎల్‌లో  చెన్నై సూపర్ కింగ్స్‌ను గాయాలు వేధిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందు నుంచే గాయాలతో సతమతమవుతున్న  సీఎస్కే.. గడిచిన వారం రోజుల్లో  ముగ్గురు ప్లేయర్లు కూడా ఇదే సమస్యతో మ్యాచ్‌లకు దూరమయ్యారు.  రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందే  దీపక్ చాహర్ గాయంతో  దూరమవగా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ  సిసంద మగల కూడా గాయపడ్డాడు.  అతడికి రెండు వారాలు విశ్రాంతి కావాలని  చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్  మ్యాచ్ ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.


రాజస్తాన్‌తో మ్యాచ్ లో  ఆకాశ్ సింగ్ వేసిన   15వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్  బంతిని గాల్లోకి లేపగా  క్యాచ్ అందుకునే క్రమంలో  మగల గాయపడ్డాడు.  మగలతో పాటు గాయపడ్డ చెన్నై ఆటగాళ్ల గురించి  ఫ్లెమింగ్ అప్డేట్ ఇచ్చాడు. 


ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘దీపక్ చాహర్ రెండు నుంచి మూడు వారాలు అందుబాటులో ఉండడు.  సిమర్‌జీత్ సింగ్   కాస్త బెటర్ గానే ఉన్నా  అతడు కూడా  వారం పది రోజుల వరకూ  ఆడకపోవచ్చు.  బెన్ స్టోక్స్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు.  ముఖేశ్ చౌదరి  దూరమైన సంగతి మీకు తెలిసిందే.  మగల కూడా  కనీసం  రెండు వారాల పాటు ఆడటం వీలుకాదు..’ అని చెప్పాడు.   


గాయాల చెన్నై.. 


ఈ సీజన్‌కు ముందు నుంచే చెన్నైని గాయాలు వేధిస్తున్నాయి.   కివీస్ పేసర్  కైల్ జెమీసన్ గాయం కారణంగా ఫిబ్రవరిలోనే   ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.  ఐపీఎల్-16 ప్రారంభానికి సరిగ్గా  మూడు రోజుల ముందు  గత సీజన్ లో  చెన్నై  పేస్ బౌలింగ్ కు వెన్నెముకగా నిలిచిన  ముఖేశ్   చౌదరి కూడా రూల్ అవుట్ అయ్యాడు.  చెన్నై ఇష్టపడి భారీగా  ఖర్చుచేసి తెచ్చుకున్న ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్  రెండు మ్యాచ్ లు ఆడి ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తో పోరుకు ముందు వాంఖెడేలో  ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు.  ఇదే ముంబై తో మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ దీపక్ చాహర్ తొడ కండరాలు  పట్టేయడంతో   అతడు    గ్రౌండ్ ను వీడాడు.  అంతో ఇంతో అంతర్జాతీయ అనుభవమున్న పేసర్ సిసంద మగల కూడా   బుధవారం నాటి మ్యాచ్ లో గాయపడ్డాడు. 


ఇక వాళ్లే దిక్కు.. 


దీపక్ చాహర్, మగల  దూరమవడంతో  రాబోయే రెండు వారాల పాటు  చెన్నై ఆడబోయే మ్యాచ్ లకు  యువ బౌలర్లే దిక్కు కానున్నారు.   లంక  పేసర్ మతీశ పతిరన,  బుధవారం రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆకట్టుకున్న ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే,  రాజ్యవర్ధన్ హంగర్గేకర్ లతోనే చెన్నై నెట్టుకురావాల్సి  ఉంటుంది.  జట్టులో  సౌతాఫ్రికా  ఆల్  రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నా అతడికి ఆడే అవకాశం దక్కుతుందనేది అనుమానమే.. 


చెన్నై రాబోయే రెండు వారాల్లో  మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి ఏప్రిల్ 17న బెంగళూరుతో, 21న హైదరాబాద్‌తో, 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో  ఆడనుంది.  ఈ మూడు మ్యాచ్‌లలో అంతగా అనుభవం లేని యువ పేసర్లు ఎలా రాణిస్తారో  చూడాలి.