KKR New Captain, IPL 2023:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సరికొత్త సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సరికొత్త నాయకుడిని ఎంపిక చేసింది. యువ క్రికెటర్‌ నితీశ్ రాణాను తాత్కలిక సారథిగా ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేనన్ని రోజులూ అతడే జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెరుగైన జట్టే! గౌతమ్‌ గంభీర్‌ రెండుసార్లు వారికి ట్రోఫీ అందించాడు. ప్రతి సీజన్లోనూ ప్రత్యర్థులను వణికించేలా కోర్‌ టీమ్‌ను తయారు చేశాడు. రెండేళ్ల క్రితం అతడు దిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లడంతో కేకేఆర్‌కు నాయకత్వ కష్టాలు మొదలయ్యాయి. ఏటా ఘోరంగా ఓడిపోతోంది. చివరి సీజన్లో శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించింది. అందుబాటులో ఉన్న వనరులతో అతడు జట్టును బాగానే నడిపించాడు. కొన్నాళ్లుగా అతడు వెన్నెముక గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. టీమ్‌ఇండియాకూ దూరమయ్యాడు. ఈ సీజన్లో ఫస్ట్‌హాఫ్‌కు అతడు అందుబాటులో ఉండడని తెలిసింది.




కెప్టెన్సీ కోసం సునిల్‌ నరైన్‌ను కేకేఆర్‌ పరిగణనలోకి తీసుకుంది. అయితే అరంగేట్రం ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో నాయకుడిగా అతడు రాణించలేదు. అతడి సారథ్యంలో కేకేఆర్‌కే చెందిన అబుధాబి నైట్‌రైడర్స్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ  టోర్నీలో ఎనిమిది ఓటములు, ఒక గెలుపుతో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. దాంతో నితీశ్ రాణాకు బాధ్యతలు అప్పగించింది.


దేశవాళీ క్రికెట్లో నితీశ్‌ రాణాకు కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్‌ ఉంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో దిల్లీకి 12 మ్యాచుల్లో కెప్టెన్సీ చేశాడు. ఎనిమిది విజయాలు, నాలుగు పరాజయాలు అందించాడు. 2018 నుంచి అతడు కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున 74 మ్యాచుల్లో 135.61 స్ట్రైక్‌రేట్‌తో 1744 పరుగులు చేశాడు. గతేడాది శ్రేయస్‌ అయ్యర్ తర్వాత ఎక్కువ రన్స్‌ చేసిందీ అతడే. 143 స్ట్రైక్‌రేట్‌తో 361 రన్స్‌ సాధించాడు. కాగా కేకేఆర్‌కు ఇప్పుడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ స్థానంలో చంద్రకాంత్‌ పండిత్‌ కోచ్‌గా వచ్చారు. భరత్‌ అరుణ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నారు.


'శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకొని 2023 ఐపీఎల్‌ ఎడిషన్లో ఏదో ఒక దశలో ఆడతాడని మేం ధీమాగా ఉన్నాం. నాయకత్వ అనుభవం గల నితీశ్‌ జట్టులో ఉండటం మా అదృష్టం. అతడు దేశవాళీ క్రికెట్లో దిల్లీకి కెప్టెన్సీ చేశాడు. 2018 నుంచి కేకేఆర్‌కు ఆడుతున్నాడు. అతడు రాణిస్తాడన్న నమ్మకం ఉంది. కొత్త కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌, సపోర్ట్ స్టాఫ్‌ అతడికి అండగా ఉంటారు. శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చేసరికి కొత్త పాత్రలో అతడు అత్యుత్తమంగా రాణిస్తాడని మా విశ్వాసం' అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తెలిపింది.