WPL Season 1 Winner: బీసీసీఐ  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విజేతగా ముంబై నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్   తక్కువ స్కోరు చేయడంతో  ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది.  సాధించాల్సిన లక్ష్యమేమీ భారీగా లేకపోయినా  132 పరుగులు చేయడానికి ముంబైని ఢిల్లీ బౌలర్లు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు.  లక్ష్య ఛేదనలో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై.. తొందరపడితే లాభం లేదని, నిదానమే ప్రధానం అన్నట్టుగా  ఆడింది. పరుగుల రాక కష్టమైనా.. నాట్ సీవర్ (55 బంతుల్లో 60 నాటౌట్, 7 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో  37, 5 ఫోర్లు) లు ఓపికతో క్లాస్ ఇన్నింగ్స్‌‌తో ముంబైకి తొలి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందించారు. ఈ విజయంతో  తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న టీమ్‌గా ముంబై చరత్ర సృష్టించింది. ఢిల్లీ రన్నరప్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గనక మరో 15-20 పరుగులు చేసుంటే  ఫలితం మరో విధంగా ఉండేది. 


స్వల్ప లక్ష్యమే అయినా  ఢిల్లీ  బౌలర్లు కూడా ముంబైకి చెమటలు పట్టించారు. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫామ్ లో ఉన్న   యస్తికా భాటియా  (4)ను రాధా యాదవ్ పెవిలియన్‌కు పంపింది.  నాలుగో ఓవర్లో జొనాసేన్..   మాథ్యూస్   (12 బంతుల్లో  13, 3 ఫోర్లు)కు చెక్ పెట్టింది.  తొలి ఐదు  ఓవర్లలో ముంబై చేసిన పరుగులు  26 మాత్రమే.  


మరీ నెమ్మదిగా... 


వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో ముంబై  స్కోరు నెమ్మదించింది.   మరిజానె కాప్, జొనాసేన్, శిఖా పాండే, రాధా యాదవ్ లు కట్టుదిట్టంగా బంతులేయడంతో  ముంబైకి పరుగుల రాకే కష్టమైంది. ఐదో ఓవర్ నుంచి 9వ  ఓవర్ మధ్యలో 19 పరుగులే వచ్చాయి.  క్యాప్సీ వేసిన  పదో ఓవర్లో తొలి బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీకి తరలించడంతో  ముంబై స్కోరు 50 పరుగులు దాటింది.  


ఆ తర్వాత రాధా యాదవ్ వేసిన 11వ ఓవర్లో  నాలుగు పరుగులే వచ్చాయి. ముంబై  సాధించాల్సిన రన్ రేట్  పెరుగుతుండటంతో  సీవర్,  కౌర్ రూట్ మార్చారు.   క్యాప్సీ వేసిన  12వ ఓవర్లో   తలా  ఓ  బౌండరీ సాధించారు.   ఈ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. ఇదే ఊపులో కౌర్ తర్వాతి రెండు ఓవర్లలో  కూడా ఓవర్‌కు ఒక ఫోర్ బాదింది. 


ఆఖరి 5 ఓవర్లలో హైడ్రామా.. 


ఇక చివరి   30 బంతుల్లో  44 పరుగులు కావాల్సి ఉండగా..  శిఖా పాండే వేసిన   16వ ఓవర్లో 8 పరుగులొచ్చాయి.  క్యాప్సీ వేసిన  17వ ఓవర్లో  తొలి బంతికి పరుగు తీయబోయి  హర్మన్‌ప్రీత్   రనౌట్ అయింది.  దీంతో అభిమానులకు కొద్దిరోజుల క్రితం టీ20 వరల్డ్ కప్  సెమీఫైనల్లో  కౌర్ రనౌట్ అయిన క్షణాలు మదిలో మెదిలాయి. ముంబైకి కూడా ఇదే ఫలితం రాబోతుందా..? అన్న అనుమానం ఆ  జట్టు అభిమానుల్లో కలిగింది.  కానీ  సీవర్  ఆ ఛాన్స్ ఇవ్వలేదు. క్యాప్సీ వేసిన అదే ఓవర్లో  సీవర్ రెండు ఫోర్లు కొట్టింది.  జొనాసేన్ వేసిన  19వ ఓవర్లో కెర్  ( 8 బంతుల్లో  14 నాటౌట్, 2 ఫోర్లు) రెండు ఫోర్లు బాది లక్ష్యాన్ని చిన్నది చేసింది. ఆఖరి ఓవర్లో సీవర్ ఫోర్ కొట్టడంతో  తొలి డబ్ల్యూపీఎల్ ముంబై సొంతమైంది. 


 






ఈ మ్యాచ్ ‌లో తొలుత  టాస్  గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి  131 పరుగులు చేసింది.   ఆ జట్టులో  కెప్టెన్ మెగ్ లానింగ్  (35) రాణించగా  షెఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ,  జెమీమా రోడ్రిగ్స్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు.  కానీ ఆఖర్లో  శిఖా పాండే  (17 బంతుల్లో 27 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్), రాధా యాదవ్ (17 బంతుల్లో  27 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్)   మెరుపులు  మెరిపించడంతో  ఢిల్లీ పోరాడే స్కోరు సాధించింది.  ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్ లు తలా మూడు వికెట్లు తీశారు.