Morne Morkel, LSG: 


కైల్‌ మేయర్స్‌, మార్క్‌వుడ్‌ ఎదుగుదల లక్నో సూపర్‌ జెయింట్స్‌కు బోనస్‌ అని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ అంటున్నాడు. వీరిద్దరూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న తీరు బాగుందన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో వీరు అదరగొడతారని ధీమా వ్యక్తం చేశాడు.


ఈ సీజన్లో ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ (Mark Wood) దుమ్మురేపుతున్నాడు. 150 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ల మాదిరిగా బంతులు విసురుతున్నాడు. రెండు మ్యాచుల్లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దిల్లీ పోరులో 14కే 5 వికెట్లు తీశాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 49 రన్స్‌కు 3 వికెట్లు సాధించాడు. మరోవైపు ఓపెనర్‌ కైల్ మేయర్స్‌ (Kyle Mayers) సునాయాసంగా సిక్సర్లు బాదేస్తున్నాడు. అపోజిషన్‌ బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. వరుసగా  73 (38 బంతుల్లో), 53 (22 బంతుల్లో) పరుగులు సాధించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ తర్వాత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.






'మార్క్‌ వుడ్‌ గురించి చెప్పాలంటే చాలా వుంది. అతడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్నాడు. దూకుడుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడు మా స్ట్రైక్‌ బౌలర్‌. ఐపీఎల్‌లో అతడు మూడు మ్యాచులే ఆడాడు. ఉపఖండం పిచ్‌లపై ఎలా ఆడాలో ఇంకా తెలుసుకుంటున్నాడు. త్వరగా లెంగ్తులను దొరకబుచ్చుకుంటున్నాడు. అతడితో ఎప్పుడు బౌలింగ్‌ చేయించాలో, ఎలాంటి బంతులు వేయించాలో చూసుకోవడమే నా బాధ్యత' అని మోర్కెల్‌ అన్నాడు.


'మార్క్‌వుడ్‌ ప్రపంచకప్‌లు గెలిచిన ఆటగాడు. చాలా అనుభవం ఉంది. ఇంగ్లాండ్‌కు ఏళ్ల తరబడి ఆడుతున్నాడు. విజయానికి దారులేంటో తెలుసు. అందుకే ఐపీఎల్‌ గురించి అతిగా ఆలోచించొద్దని అడ్వైస్‌ ఇచ్చాను. వేగాన్ని చూసే అతడిని ఎంచుకున్నాం. వీలైనంత మేరకు కొందరు బ్యాటర్లను అతడికి టార్గెట్‌గా ఇస్తాం. వికెట్లు తీయిస్తాం' అని మోర్కెల్‌ తెలిపాడు. ఇక కైల్‌ మేయర్స్‌ బ్యాటింగ్‌ అద్భుతమని చెప్పాడు.


'కైల్‌ ఇలా ఆడుతుండటం బాగుంది. సీపీఎల్‌లో సెయింట్ లూసియాలో అతడితో కలిసి ఆడాను. వైట్‌ బాల్‌ క్రికెట్లో గొప్పగా ఎదిగినందుకు హ్యాపీగా ఉంది. ఎస్‌ఏ20 లీగులోనూ అతడి మెరుపులు చూశాను. జస్ట్‌.. క్రీజులో ఉండే బౌలర్లను భయపెడతాడు. ఇప్పుడింకా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. క్వింటన్‌ డికాక్‌ వస్తే జట్టు ఎంపిక తలనొప్పిగా మారుతుంది. కాకపోతే అది నా ప్రాబ్లమ్‌ కాదు. ఏదేమైనా మేయర్స్‌ ఇలా ఫైర్‌ ఇన్నింగ్సులు ఆడటం బాగుంది' అని మోర్కెల్‌ వెల్లడించాడు.,


చెన్నై సూపర్‌ కింగ్స్‌ మురిసింది! చెపాక్‌లో సొంత అభిమానులను మైమరిపించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 205/7కు పరిమితం చేసింది. మొయిన్‌ అలీ (4/26) ప్రత్యర్థి దూకుడును దెబ్బతీశాడు. కైల్‌ మేయర్స్‌ (53; 22 బంతుల్లో 8x4, 2x6) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ బాదాడు. నికోలస్‌ పూరన్‌ (32; 18 బంతుల్లో 2x4, 3x6) మెరిశాడు. అంతకు ముందు సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 31 బంతుల్లో 3x4, 4x6), డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్‌ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు.