Rajat Patidar Ruled Out: 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు బిగ్‌ షాక్‌! యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ (Rajat patidar) ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. అచిలిస్‌ మీల్‌ ఇంజూరీతో సీజన్‌ మొత్తానికీ దూరమవుతున్నాడని ఆర్సీబీ ప్రకటించింది. రిహబిలిటేషన్‌ కోసం ఎన్‌సీఏకు వెళ్తున్నాడని వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది.


'దురదృష్ట వశాత్తు గాయంతో రజత్‌ పాటిదార్‌ ఐపీఎల్‌ 2023కి దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రక్రియలో అతడికి మేం పూర్తి అండగా ఉంటాం. అతడి స్థానంలో కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌ ఇంకా ఎవరినీ ప్రకటించలేదు' అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్వీట్‌ చేసింది.






ఇప్పటి వరకు రజత్‌ పాటిదార్‌ ఆడింది రెండు సీజన్లే. మొత్తంగా 12 సీజన్లలో 40.40 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 404 పరుగులు చేశాడు. 2021లో 4 మ్యాచుల్లో 71 పరుగులు చేశాడు. 2022లోనే అతడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఏడు ఇన్నింగ్సుల్లోనే 55.50 సగటు, 152 స్ట్రైక్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 112*. ఈ ఏడాది జట్టు చేసిన మొత్తం స్కోరు 24 శాతం వాటా అతడిదే.


చివరి సీజన్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో మిడిలార్డర్లో రజత్‌ పాటిదారే కీలకంగా ఆడాడు. విరాట్‌ కోహ్లీ, మాక్స్‌వెల్‌ ఫామ్‌లో లేనప్పటికీ సాధికారికంగా పరుగులు చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై రెండో మ్యాచులో 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టి ఆశలు రేపాడు. ఆఖర్లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అజేయ శతకం బాదేశాడు. కేవలం 54 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. 207 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ పైనా హాఫ్ సెంచరీతో అలరించాడు.


ఆర్సీబీకి  ఉన్న ప్రధాన పేసర్ జోస్ హేజిల్ వుడ్. ఈ ప్రపంచ నెంబర్ వన్ బౌలర్.. ఈ ఏడాది  స్వదేశం (ఆస్ట్రేలియా) లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డాడు. మూడో టెస్టులో ఆడలేదు. గాయం పూర్తిగా కోలుకోకున్నా  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని  టీమ్ తో కలిసి ఎగేసుకుని భారత్ కు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక  అతడు ఇంకా ఫిట్ గా లేడని, మరికొన్నాళ్లు విశ్రాంతి కావాలని  క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ అతడిని  ఢిల్లీ టెస్టు ముగిశాక  సిడ్నీ ఫ్లైట్ ఎక్కించింది.  సరే టెస్టు సిరీస్ కు మిస్ అయినా వన్డే సిరీస్ వరకైనా వస్తాడనుకుంటే దానికీ రాలేదు.  వన్డే సిరీస్ పోయినా ఐపీఎల్ వరకైనా కుదురుకుంటాడనుకుంటే ఇప్పుడు  చావు కబురు చల్లగా చెప్పినట్టు  ‘ఫస్టాఫ్ కు మిస్ అవుతున్నా..’అని  సెలవిచ్చాడు.


ఐపీఎల్‌ను బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేదించి విజయాన్ని సాధించింది. ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. కెప్టెన్, మరో ఓపెనర్ ఫాఫ్ డు ఫ్లెసిస్ (73: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.