LSG vs CSK, IPL 2023:


ఐపీఎల్‌ 2023లో తొలిసారి ఒక మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోరులో ఫలితం తేలలేదు. ఎడతెరపి లేని వర్షమే ఇందుకు కారణం. దాంతో రెండు జట్లు చెరో పాయింటును పంచుకోవాల్సి వచ్చింది. ఎల్‌ఎస్‌జీ 19.2 ఓవర్లు బ్యాటింగ్‌ చేసింది. అప్పట్నుంచి వరుణుడు బ్యాటింగ్‌ మొదలు పెట్టడంతో ధోనీసేన బ్యాటు పట్టుకోకుండానే షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వాల్సి వచ్చింది.




ఏకనా స్టేడియం వికెట్లు ఏకు.. మేకైనట్టే ఉన్నాయ్‌! బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆడుతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు హోమ్‌ గ్రౌండ్‌ అడ్వాంటేజీ దక్కడమే లేదు. దాంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రెండో మ్యాచులో తక్కువ స్కోరే చేసింది. 19.2 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బేబే ఏబీ.. కుర్రాడు ఆయుష్ బదోనీ (59; 33 బంతుల్లో 2x4, 4x6) అమేజింగ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టాడు. అజేయంగా నిలిచారు. అతడికి నికోలస్‌ పూరన్‌ (20; 31 బంతుల్లో) అండగా నిలిచాడు. మొయిన్‌ అలీ, పతిరన, తీక్షణ తలో రెండు వికెట్లు పడగొట్టారు.


టప.. టపా!


వికెట్‌పై అక్కడక్కడా ప్యాచెస్‌ ఉన్నాయి. అలాగే పచ్చిక ఉంది. దాంతో అటు స్పిన్‌, ఇటు పేస్‌కు పిచ్‌ సహకరించింది. పైగా వర్షం కురవడం.. వాతావరణం చల్లగా ఉండటం బౌలర్లకు కలిసిసొచ్చింది. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 31 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 18 వద్దే కైల్‌ మేయర్స్‌ (14)ను మొయిన్‌ అలీ ఔట్‌ చేశాడు. తీక్షణ వేసిన ఆరో ఓవర్లో మనన్‌ వోరా (10), కృనాల్‌ పాండ్య (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఒక స్టన్నర్‌తో మార్కస్‌ స్టాయినిస్‌ (6)ను జడ్డూ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కరన్‌ శర్మ (9) తక్కువ స్కోరే చేశాడు.




బదోనీ.. బడా ప్లేయర్‌!


పదో ఓవర్‌ ముగియక ముందే 44/5తో కష్టాల్లో పడ్డ లక్నో సూపర్‌ జెయింట్స్‌ను యువకెరటం ఆయుష్ బదోనీ, నికోలస్‌ పూరన్‌ ఆదుకున్నారు. చక్కని బంతుల్ని గౌరవించారు. ఆచితూచి ఆడారు. సింగిల్స్‌, డబుల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. 17.2 ఓవర్లకు స్కోరును 100కు చేర్చారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 48 బంతుల్లో 59 రన్స్‌ పాట్నర్‌షిప్‌ అందించారు. పూరన్‌ ఇబ్బంది పడ్డా బదోనీ మాత్రం తగ్గేదే లే! అన్నట్టుగా ఆడాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. తీక్షణ వేసిన 17వ ఓవర్లో సిక్స్‌, బౌండరీ బాదేశాడు. ఇక చాహర్‌ వేసిన 19వ ఓవర్లో ఒక బౌండరీ, రెండు సిక్సర్లు బాదేసి స్కోర్‌ పెంచాడు. ఆఖరి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్‌ ఔటవ్వగానే చినుకులు మొదలయ్యాయి. వర్షం తెరపినిస్తుందోమేనని ఎంతగానో ఎదురు చూశారు. కటాఫ్‌ టైమ్‌ కూడా ప్రకటించేందుకు ప్రయత్నించారు. అయితే వరుణుడి ముందు ఇవేమీ సాగలేదు. చివరి 7 గంటల సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌ షేక్స్‌ ఇచ్చుకున్నారు.