LSG vs CSK, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో నేడు డబుల్‌ హెడర్‌ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీపక్‌ చాహర్‌ ఫిట్‌నెస్‌ సాధించాడని.. ఆకాశ్ స్థానంలో ఆడుతున్నాడని వెల్లడించాడు. ఏదేమైనా తాము మొదట బ్యాటింగే చేయడానికే నిర్ణయించుకున్నామని ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌ కృనాల్‌ పాండ్య అన్నాడు. గాయం వల్ల నేడు కేఎల్‌ రాహుల్ ఆడటం లేదు.




'మేం తొలుత బౌలింగ్‌ చేస్తాం. వికెట్‌ మీద చాలాసేపు కవర్లు కప్పారు. కాస్త కఠినంగా కనిపిస్తోంది. అందుకే మొదట బౌలింగ్‌ చేస్తాం. ఆడేముందు పరిస్థితులు, వేదికను పరిశీలించడం అవసరం. దీపక్‌ చాహర్ ఫిట్‌నెస్‌ సాధించాడు. ఆకాశ్‌ సింగ్‌ స్థానంలో ఆడుతున్నాడు. మిగిలిన టీమ్‌ అలాగే ఉంటుంది. నా ఫేర్‌వెల్‌ను మీరే నిర్ణయించేస్తున్నారు. నేనైతే ఇంకేమీ అనుకోలేదు (నవ్వుతూ)' అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అన్నాడు.


'మేమెలాగైనా మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. వికెట్‌ ఇద్దరికీ సమానంగా అనుకూలిస్తుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడొచ్చు. కేఎల్‌ రాహుల్ ఆడకపోవడం పెద్ద లోటు. అతడో నాణ్యమైన ఆటగాడు. అయితే ఇది ఒక అవకాశాన్ని సృష్టిస్తోంది. కుర్రాళ్లంతా జోష్‌లో ఉన్నారు. మేం సానుకూలంగా ఆడుతున్నాం. మనన్‌ వోరా, కరన్ శర్మ జట్టులోకి వచ్చారు' అని లక్నో సూపర్‌ జెయింట్స్‌ తాత్కాలిక కెప్టెన్ కృనాల్‌ పాండ్య అన్నాడు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే, అజింక్య రహానె, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్‌, మతీశ పతిరన, తుషార్‌ దేశ్‌పాండే, మహీశ్‌ తీక్షణ


లక్నో సూపర్‌ జెయింట్స్‌: కైల్‌ మేయర్స్‌, మనన్‌ వోరా, కరన్ శర్మ, ఆయుష్ బదోనీ, మార్కస్‌ స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌, కృనాల్‌ పాండ్య, కృష్ణప్ప గౌతమ్‌, నవీన్‌ ఉల్‌ హఖ్‌, రవి బిష్ణోయ్‌, మొహిసిన్ ఖాన్‌




లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Giants) భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఏంటో తెలియదు! బహశా ఈ మ్యాచులో ఆడకపోవచ్చు! మరి అతడి ప్లేస్‌ను రిప్లేస్‌ చేసిది ఎవరో చూడాలి. పంజాబ్‌పై 250+ చేసిన రాహుల్‌ సేన బెంగళూరుపై 120+ టార్గెట్ ఛేదించలేకపోయింది. అందుకే ఈ పోరు అత్యంత కీలకం! ఏకనా స్టేడియం పిచ్‌లు అంచనాలకు అందడం లేదు. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. మిడిలార్డర్ భారం స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌పై ఉంది. కైల్‌ మేయర్స్‌ పవర్‌ ప్లే మొత్తం ఆడేలా జాగ్రత్తపడాలి. బౌలింగ్‌ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఇండియన్‌, ఫారిన్‌ ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. రవి బిష్ణోయ్‌, గౌతమ్‌, పాండ్య, మిశ్రా స్పిన్‌ బాగుంది.