IPL 2023, KL Rahul: 


లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌! ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2023 సీజన్‌ మొత్తానికీ దూరమయ్యే అవకాశం ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో అతడి కేసును బీసీసీఐ టేకోవర్‌ చేసినట్టు తెలిసింది. బుధవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో అతడు ఆడని సంగతి తెలిసిందే.


ఎకనా స్టేడియం వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడ్డాయి. ఆర్సీబీ ఇన్నింగ్సు ఆరంభంలోనే ఒక బౌండరీని ఆపబోయిన రాహుల్‌ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో కొందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. అతడిని మైదానం నుంచి తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ సైతం తీసుకొచ్చారు. అయితే నొప్పి భరించిన రాహుల్‌ సపోర్ట్ స్టాఫ్‌ సాయంతోనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. ఫిజియోల సాయంతో కాస్త రికవర్‌ అయ్యాడు. అయితే జట్టు ఓటమి అంచున ఉండటంతో ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు.




కేఎల్‌ రాహుల్‌ను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా హ్యామ్‌స్ట్రింగ్‌ ప్రాంతంలో వాపు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. వాపు తగ్గేంత వరకు స్కానింగ్‌ తీయడానికి వీలుండదని పేర్కొన్నారు. దాంతో అతడు తిరిగొచ్చి జట్టుతో కలిశాడు. చెన్నై మ్యాచులో మాత్రం ఆడటం లేదు. మ్యాచ్‌ ముగిశాక రాత్రికి ముంబయికి వెళ్లి బీసీసీఐకి రిపోర్టు చేస్తాడని అంటున్నారు. అక్కడే వైద్యులు పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో అతడిని ఇకపై ఐపీఎల్‌ ఆడించే అవకాశం తక్కువే! దాంతో లక్నోకు ఇకపై కృనాల్‌ పాండ్యనే కెప్టెన్సీ చేయాల్సి ఉంటుంది.




'కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం లక్నో టీమ్‌తోనే ఉన్నాడు. బుధవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచు ముగిశాక.. గురువారం శిబిరాన్ని వీడుతాడు. ముంబయిలోని బీసీసీఐ అధీకృత కేంద్రంలో స్కానింగ్‌ పరీక్షలు జరుగుతాయి. అతడితో పాటు జయదేవ్‌ కేసునూ బీసీసీఐ టేకోవర్‌ చేయనుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 'ఇలాంటి గాయమైతే చాలా నొప్పి వస్తుంది. గాయపడ్డ ప్రాంతంలో వాపు వస్తుంది. తగ్గేందుకు 24-48 గంటలు పడుతుంది. ఆ తర్వాతే స్కాన్‌ చేసేందుకు వీలవుతుంది. టెస్టు టీమ్‌లో రాహుల్‌ కీలకం కాబట్టి బహుశా ఐపీఎల్‌ మిగతా సీజన్లో ఆడకపోవచ్చు' అని ఆ అధికారి వెల్లడించారు.