Karun Nair joins LSG: 


లక్నో సూపర్‌ జెయింట్స్ మరో కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. కర్ణాటక కుర్రాడు.. త్రిశతక వీరుడు.. కరుణ్‌ నాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గాయపడి ఐపీఎల్‌ సీజన్ మొత్తానికీ దూరమైన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. రూ.50 లక్షలకు అతడిని తీసుకున్నామని లక్నో ప్రకటించింది.




ఎకనా స్టేడియం వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడ్డాయి. ఆర్సీబీ ఇన్నింగ్సు ఆరంభంలోనే ఒక బౌండరీని ఆపబోయిన రాహుల్‌ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో కొందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. అతడిని మైదానం నుంచి తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ సైతం తీసుకొచ్చారు. అయితే నొప్పి భరించిన రాహుల్‌ సపోర్ట్ స్టాఫ్‌ సాయంతోనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. ఫిజియోల సాయంతో కాస్త రికవర్‌ అయ్యాడు. అయితే జట్టు ఓటమి అంచున ఉండటంతో ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు.


వైద్య బృందం సూచన మేరకు తొడ గాయానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రిహబిలిటేషన్‌, రికవరీ మీదే దృష్టి సారిస్తాను. ఇది కఠిన నిర్ణయమేనని తెలుసు. కానీ రికవరీ మీదే ఫోకస్‌ చేయడం సరైన పని. లక్నో సూపర్‌ జెయింట్స్‌ను కఠిన సమయంలో వదిలి వెళ్లడం సారధిగా బాధిస్తోంది. కానీ కుర్రాళ్లు అద్భుతంగా ఆడతారని, గర్వపడేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. పక్క నుంచి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని కేఎల్‌ రాహుల్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సుదీర్ఘ సందేశం పెట్టిన సంగతి తెలిసిందే.




ఐపీఎల్‌ 2023 వేలంలో కరుణ్‌ నాయర్‌ను (Karun Nair) ఎవ్వరూ తీసుకోలేదు. కనీసం రెండోసారి పేరు వచ్చినప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. 'డియర్‌ క్రికెట్‌, మరొక్క అవకాశం ఇవ్వూ' అంటూ అతడు చేసిన ట్వీట్‌ చాలామందిని కదిలించింది. అయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతడిని పట్టించుకోలేదు. కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో ఇప్పుడు అతడికి అవకాశం వచ్చింది. లక్నో సూపర్‌ జెయింట్స్ తీసుకుంది. అతడిని ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.


కరుణ్‌ నాయర్‌కు ఇండియన్‌ పిచ్‌లపై మంచి అనుభవం, అవగాహన ఉన్నాయి. రంజీ, సయ్యద్‌ ముస్తాక్‌ వంటి టోర్నీల్లో అన్ని రాష్ట్రాల్లో పర్యటించాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్‌ సీజన్‌ సగం ముగిసిన తర్వాత వికెట్లు నెమ్మదించాయి. పైగా లక్నో పిచ్‌లు ఎవరికీ అర్థం కావడం లేదు. టూపేస్‌ ఉండటం, పేస్‌, స్పిన్‌ను అనుకూలిస్తుండటంతో ఆడటం కష్టమవుతోంది. అన్‌ఈవెన్‌ బౌన్స్‌ ఇబ్బంది పెడుతోంది. సొంత జట్టులోని ఆటగాళ్లే లక్నోలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వికెట్లపై ఆచితూచి ఆడుతూనే షాట్లు ఆడాలి. అందుకే కరుణ్‌కు అవకాశం ఇచ్చినట్టు తెలిసింది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కరుణ్‌ నాయర్‌ ఇప్పటి వరకు 76 మ్యాచులు ఆడాడు. 68 ఇన్నింగ్సుల్లో 1496 పరుగులు చేశాడు. 23.75 సగటు, 127 స్ట్రైక్‌రేట్‌తో అలరించాడు. గతంలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. పంజాబ్‌ కింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో అతడికి మంచి అవకాశాలే ఇచ్చారు. అయితే అంచనాలను అందుకోకపోవడంతో మళ్లీ విడిచిపెట్టారు. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చిన నాయర్‌ ఏం చేస్తాడో చూడాలి.