రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణించింది. సవాయ్‌ మాన్‌ సింగ్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత సంజూ శాంసన్ సేన 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప టార్గెట్ ను గుజరాత్ ఆటగాళ్లు 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు శుబ్ మన్ గిల్ (36; 35 బంతుల్లో 6x4), సాహా (41 నాటౌట్; 34 బంతుల్లో 5x4) రాణించారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (39 నాటౌట్; 15 బంతుల్లో 3x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 14 ఓవర్లకు ఒక బంతి మిగిలుండగానే గుజరాత్ ను విజతీరాలకు చేర్చారు. ఈ విజయంతో 14 పాయింట్లతో గుజరాత్ టేబుల్ టాపర్ గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ ను ఓడించి టేబుల్ టాపర్ గా నిలవాలనుకున్న సంజూ సేన ఆశలకు పాండ్యా సేన గండికొట్టింది. రాజస్థాన్ 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.


స్వల్ప టార్గెట్ కావడంతో ఓవైపు ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు గుజరాత్ ఓపెనర్లు. గిల్ ఔటయ్యాక బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సాధ్యమైనంత త్వరగా మ్యాచ్ ముగించేలా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అటు బ్యాటింగ్ లో విఫలైన రాజస్థాన్ రాయల్స్ ఇటు బౌలింగ్ లోనూ తేలిపోయింది. ప్రత్యర్థి టైటాన్స్ ను ఏ దశలోనూ కంట్రోల్ చేయకపోవడంతో పద్నాలుగు ఓవర్లకే మ్యాచ్ ముగించారు గుజరాత్ బ్యాటర్స్.






గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ కొలాప్స్‌ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సంజూ సేన 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌటైంది. చిన్న చిన్న తప్పిదాలు, షాట్ల ఎంపికలో పొరపాట్లు సంజూ సేన కొంప ముంచాయి! అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌ ఖాన్‌ (3/14), నూర్‌ అహ్మద్‌ (2/25) ప్రత్యర్థిని భారీ దెబ్బ కొట్టారు. సంజూ శాంసన్ (30; 20 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. ట్రెంట్‌ బౌల్ట్‌ (15; 11 బంతుల్లో 1x4, 1x6) కాసేపు పోరాడాడు.






సంజూ ఉన్నంత వరకే!
సవాయ్ మాన్‌ సింగ్‌ స్టేడియంలో సంక్లిష్టమైన పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరిగింది. వికెట్‌ ఎలా ఉంటుందో తెలియదని మొదటే సంజూ శాంసన్‌ చెప్పాడు. అతడి మాటలకు తగ్గట్టే పిచ్‌ భిన్నంగా స్పందించింది. పేసర్లు, స్పిన్నర్లు అదరగొట్టారు. దాంతో రెండో ఓవర్లోనే జోస్‌ బట్లర్‌ (8) ఔటయ్యాడు. సంజూ శాంసన్‌, యశస్వీ జైశ్వాల్‌ రెండో వికెట్‌కు 21 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే అవగాహన లోపంతో ఓ అనవసర పరుగుకు ప్రయత్నించి జైశ్వాల్‌ ఔటవ్వడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాజస్థాన్‌ 50/2తో నిలిచింది.


మిడిలార్డర్‌ కొలాప్స్‌!
సంజూ శాంసన్‌ క్రీజులో ఉండటంతో రాజస్థాన్‌ మంచి స్కోర్‌ చేసేలా కనిపించింది. జోష్‌ లిటిల్‌ వేసిన ఏడో ఓవర్లో ఆఫ్‌సైడ్‌ షాట్‌కు ప్రయత్నించి అతడు ఔటయ్యాడు. టాప్‌ ఎడ్జ్‌ అయిన బంతి గాల్లోకి లేచింది. హార్దిక్‌ పాండ్య సునాయాసంగా క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత 9 పరుగుల వ్యవధిలోనే రవిచంద్రన్‌ అశ్విన్ (2), రియాన్‌ పరాగ్‌ (2) పెవిలియన్‌ చేరడంతో రాయల్స్‌ కష్టాలు పెరిగాయి. షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (7), ధ్రువ్‌ జోరెల్‌ (9) ఆదుకోలేదు. అప్పటికి స్కోరు 14.1 ఓవర్లకు 96/8. ఈ సిచ్యువేషన్లో ట్రెంట్‌ బౌల్ట్‌ కాస్త పోరాడాడు. ఒక సిక్స్‌, ఒక బౌండరీ బాది స్కోరును 110 దాటించాడు. 16.3వ బంతికి అతడిని మహ్మద్‌ షమి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరో భారీ షాట్‌ ఆడబోయి ఆడమ్‌ జంపా (7) రనౌట్‌ అవ్వడంతో రాయల్స్‌ కథ ముగిసింది.