Gautam Gambhir: 


టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఏం చేసినా సంథింగ్‌ స్పెషల్‌ అన్నట్టే ఉంటుంది! ఫిట్టింగ్‌ రిప్లేస్‌ ఇవ్వడంలో అతనెప్పుడూ ముందుంటాడు. ప్రత్యర్థులు ఎవరైనా సరే.. ఢీ అంటే ఢీ అంటాడు. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అతడు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను 'ష్‌....!' అంటూ నోర్మూసుకోండి అనేలా సైగ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.




సోమవారం చిన్నస్వామి వేదికగా జరిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) మ్యాచ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. ఆఖరి ఓవర్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆసక్తి నెలకొంది. హర్షల్‌ పటేల్‌ వేసిన ప్రతి బంతికీ ఫ్యాన్స్‌ గుండెలు గుభేల్‌మన్నాయి. ఈ హై స్కోరింగ్‌ ఛేజ్‌లో ఆఖరి బంతికి మెలోడ్రామా జరిగింది.


రెండు బంతుల్లో ఒక పరుగు అవసరం కాగా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన జయదేవ్‌ ఉనద్కత్‌ బంతిని గాల్లోకి లేపాడు. దానిని ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి అందుకున్నాడు. అప్పటికే మ్యాచ్‌ డ్రా అయినా లక్నో గెలవాలంటే ఒక పరుగు అవసరం. ఆఖరి బంతిని వేస్తుండగా క్రీజు దాటిన నాన్‌ స్ట్రైకర్‌ ...రవి బిష్ణోయ్‌ను హర్షల్‌ రనౌట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బాడీ మూమెంట్‌ వేగంగా ఉండటంతో బయటకు వెళ్లి మళ్లీ వికెట్లకు బంతిని విసిరాడు. దానిని అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించి మళ్లీ బంతి వేయించాడు. అవేశ్‌ దానిని స్ట్రైక్‌ చేయకపోయినా బిష్ణోయ్‌ అప్పటికే సగం దూరం పరుగుత్తి స్ట్రైకర్‌ వద్ద రన్‌ కంప్లీట్‌ చేశాడు.


సాధారణంగా బెంగళూరులో మ్యాచ్‌ జరిగితే ఆర్సీబీ అభిమానులు విపరీతంగా కేకలేస్తారు. విజిల్స్‌తో ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తారు.  కొన్నిసార్లు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు జరిగినా కోహ్లీకి మద్దతిస్తూ రోహిత్‌ ఆడుతున్నప్పుడు ఆర్సీబీ.. ఆర్సీబీ అని కేకలు వేస్తుంటారు. వారికి కాస్త బుద్ధి చెప్పాలనుకున్నాడో... సందర్భం కుదిరిందో... ఊరికే అన్నాడో... గంభీర్‌ ష్‌...! అంటూ సైగలు చేశాడు. దీనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఇలాగే చేయాలంటూ సపోర్టు చేస్తున్నారు. ఏదేమైనా మ్యాచ్‌ ముగిశాయి. విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్ హగ్‌ చేసుకొని మాట్లాడుకోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.