Harshal Patel: ఐపీఎల్ -16 సీజన్ నెమ్మదిగా పుంజుకుంటున్నది. వన్ సైడెడ్ గేమ్స్ తో ఫస్ట్ వీక్ అంతా బోర్ గా సాగిన మ్యాచ్‌లు గడిచిన మూడు రోజులుగా మాత్రం ఉత్కంఠగా ముగుస్తున్నాయి. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ లో ఆఖరి బంతి వరకూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచూలాడింది. ఇక సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన పోరులో కూడా చివరి బంతికే ఫలితం తేలింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశమున్నా ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం వల్ల లక్నోనే విజయం వరించింది.
స్టోయినిస్, పూరన్ ల వీరవిహారంతో లక్నో విజయానికి దగ్గరగా వచ్చినా 17వ ఓవర్లో పూరన్ నిష్క్రమించడంతో హై డ్రామా మొదలైంది. ఇక ఆఖరి ఓవర్లో ఆరు పరుగులు కావల్సి ఉండగా.. 2, 5 వ బంతులకు వికెట్లు తీసిన హర్షల్.. చివరి బంతిని వేయబోయేముందు ‘మన్కడింగ్’ (నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఆటగాడిని రనౌట్ చేయడం) చేయడానికి యత్నించి విఫలమయ్యాడు. వాస్తవానికి హర్షల్ రనౌట్ చేసినా అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఎందుకు..?
కారణమిదే..
హర్షల్ ఆఖరి బంతి వేసే క్రమంలో రనౌట్ చేశాడు. కానీ ఇలా ఔట్ చేయాలంటే బౌలర్.. తన బౌలింగ్ యాక్షన్ ను మొదలుపెట్టి బంతిని రిలీజ్ చేసే సమయంలో బెయిల్స్ ను పడగొట్టాలి. అలా కాకుండా రనప్ తో వచ్చి చేయి బౌలింగ్ యాక్షన్ చేయకుంటే అవుట్ ఇవ్వరు. ఐసీసీ రూల్ 38.3.1.2 కూడా ఇదే చెబుతున్నది. అదీగాక హర్షల్ ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు బెయిల్స్ పడలేదు. దీంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఫస్ట్ అటెంప్ట్ లో మిస్ అయినా సెకండ్ టైమ్ బిష్ణోయ్ ను ఔట్ చేసేందుకు యత్నించినా అంపైర్ అందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లంతా అప్పీల్ చేసినా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ మాత్రం.. ‘అదెలా ఔట్..? బౌలింగ్ యాక్షన్ లేదుగా..’ అన్నట్టుగా వారిపై ఉరిమిచూశాడు. కాగా హర్షల్ చేసిన ఈ సిల్లీ మిస్టేక్ పై నెట్టింట ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ‘మన్కడింగ్’ చేయడంలో సిద్ధహస్తుడైన అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ పలువురు నెటిజన్లు ఫోటోలు, కామెంట్స్ తో హర్షల్ ను ఆటాడుకుంటున్నారు.
హర్షల్ కు వంద వికెట్లు :
ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఆర్సీబీని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన హర్షల్.. ఆ క్రమంలో విజయం సాధించనప్పటికీ ఒక రికార్డును అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్ లో జయదేవ్ ఉనద్కత్ ను ఔట్ చేయడం ద్వారా హర్షల్ ఈ లీగ్ లో వంద వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. హర్షల్ తన ఐపీఎల్ కెరీర్ లో 2012 నుంచి ఇప్పటివరకు 81 మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో ఐదు వికెట్ల ప్రదర్శన (5-27) కూడా ఒకసారి చేశాడు. ఈ లీగ్ లో వంద కంటే ఎక్కువ వికెట్లు తీసినవారిలో హర్షల్ 20వ స్థానంలో ఉన్నాడు. ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో డ్వేన్ బ్రావో (183) అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్ (174) బ్రావో రికార్డును బ్రేక్ చేయడానికి దూసుకొస్తున్నాడు. మరో పది వికెట్లు తీస్తే ఐపీఎల్ లో హయ్యస్ట్ వికెట్ టేకర్ చహలే అవుతాడు.