Dwayne Bravo On Death Bowling: ఐపీఎల్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో చాలా విజయవంతమైన బౌలర్. అతని ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడంలో ఫేమస్‌.


ఐపీఎల్‌లో అత్యధికంగా 183 వికెట్లు తీసిన ఆటగాడిగా ఇప్పటికీ అతని పేరు ఉంది. బ్రేవో బౌలింగ్‌లోనే కాకుండా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2023లో అతను చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్. తాజాగా టీ20లో డెత్ ఓవర్‌ల్లో బౌలింగ్ చేయడంపై తన స్పందనను తెలిపాడు.


డెత్ ఓవర్లలో బెస్ట్ బాల్ ఏది?
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో ఖచ్చితమైన యార్కర్ బంతులకు పేరుగాంచాడు. అతను కాళ్లకు టార్గెట్ చేస్తూ వేసిన యార్కర్లతో డజన్ల కొద్దీ వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో వేయడానికి ఉత్తమమైన బంతి ఏది అని ఇటీవల అతన్ని అడిగారు. అతను దానికి సమాధానంగా 'ఇది ఎల్లప్పుడూ యార్కర్‌గా ఉండాలి. కానీ బౌలింగ్ చేయడానికి ఇది చాలా కష్టమైన బంతుల్లో ఒకటి.' అన్నాడు. 'మీరు నిజంగా గంటల తరబడి ప్రాక్టీస్ చేయాలి. ఓవర్ ది వికెట్, రౌండ్ ది వికెట్, బౌలింగ్ వైడ్, స్ట్రెయిట్ బౌలింగ్ వంటి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే బౌలింగ్ స్టాక్‌లో ఇది చాలా ముఖ్యమైన బంతి.’ అని అభిప్రాయపడ్డాడు.


యార్కర్లు లేకుండా ఎక్కువ కాలం ఉండవు
లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ షా ఆఫ్రిది, మిచెల్ స్టార్క్ బౌలర్ల వద్ద ఉన్న పేస్ డ్వేన్ బ్రేవోకు లేదు. కానీ అతను తన ఖచ్చితమైన బౌలింగ్ ద్వారా పిన్ పాయింట్ యార్కర్లను వేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా బ్రేవో మాట్లాడుతూ, 'టీ20 ఫార్మాట్‌లో బౌలర్ల దగ్గర యార్కర్ అనేది ఉండాల్సిన అస్త్రం. ఒక వేళ మీ దగ్గర యార్కర్ లేకపోతే మీరు ఎక్కువ కాలం ఉండలేరు. మీరు నిజంగా ఫాస్ట్ బౌలర్ అయితే తప్ప మీరు మనుగడ సాగించలేరు. కాబట్టి మీరు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసినప్పటికీ యార్కర్‌పై ఆధారపడాల్సిన క్షణం వస్తుంది. ఎందుకంటే ఇది కష్టతరమైన బంతి, సురక్షితమైన ఆప్షన్. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా, ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరిలో, యార్కర్ ఎల్లప్పుడూ ప్రభావవంతమైన బంతి.’ అన్నాడు.


ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా విండీస్ ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రేవో రికార్డు సృష్టించాడు. బ్రేవో 161 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. గత సీజన్ వరకు ఐపీఎల్‌లో భాగమైన అతను ఇప్పుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే అతనికి 13 వికెట్లు కావాలి. బహుశా ఈ సీజన్‌లో అతను ఈ భారీ రికార్డును తన పేరిట లిఖించుకోవచ్చు.


ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
1. డ్వేన్ బ్రావో: 183 వికెట్లు
2. యుజ్వేంద్ర చాహల్: 171 వికెట్లు
3. లసిత్ మలింగ: 170 వికెట్లు
4. అమిత్ మిశ్రా: 166 వికెట్లు
5. ఆర్ అశ్విన్: 159 వికెట్లు
6. పీయూష్ చావ్లా : 157 వికెట్లు
7. భువనేశ్వర్ కుమార్ : 154 వికెట్లు
8. సునీల్ నరైన్ : 153 వికెట్లు
9. హర్భజన్ సింగ్ : 150 వికెట్లు
10. జస్ప్రీత్ బుమ్రా: 145 వికెట్లు