LSG vs SRH, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో శుక్రవారం పదో మ్యాచ్‌ జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. చక్కని బ్యాలెన్స్‌తో రాహుల్‌ సేన జోష్‌లో ఉంది. సన్‌రైజర్స్‌ తొలి గెలుపు కోసం పట్టుదలగా ఉంది. మరి వీరిలో విజేత ఎవరు?


జోష్‌లో లక్నో!


చివరి సీజన్‌తో పోలిస్తే లక్నో సూపర్ జెయింట్స్‌ మరింత పటిష్ఠంగా కనిపిస్తోంది. కైల్‌ మేయర్స్‌ రాకతో టాప్‌ ఆర్డర్‌ దూకుడుగా మారింది. అతడు క్రీజులో నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు ప్రెజర్‌ ఫీలవుతున్నారు. కేఎల్‌ రాహుల్‌ తన స్థాయి బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. సఫారీ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ రావడం గుడ్‌ సైన్‌! అయితే ఇప్పుడు ఆడుతున్న నలుగురు ఫారినర్స్‌లో ఎవరిని తీసేయాలన్నదే సమస్య! బహుశా స్టాయినిస్‌, మేయర్స్‌లో ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకోవచ్చు. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య జోరు పెంచాలి. ఆయుష్‌ బదోనీ, పూరన్‌ ఇంటెట్‌ బాగుంది. బౌలింగ్‌ అదుర్సే! అయితే త్వరగా పిచ్‌లను అర్థం చేసుకొని లెంగ్తులు దొరకబట్టాలి. అవేశ్‌, స్టాయినిస్‌, మేయర్స్‌, మార్క్‌వుడ్‌ పేస్‌ చూస్తారు. కొత్త కుర్రాడు యశ్‌ ఠాకూర్‌ రాణించగలడు. ఉనద్కత్‌తోనే సమస్య. కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోయ్‌ స్పిన్‌ కీలకం.


కెప్టెన్‌ రాకతో బలం!


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ బాగున్నా ఎందుకో బ్యాలెన్స్‌ కుదర్లేదు. తొలి మ్యాచులో రాజస్థాన్‌ ఇచ్చిన పెద్ద టార్గెట్‌ ఛేజింగ్‌లో ఒత్తిడికి గురయ్యారు. బౌలింగ్‌ అప్‌ టు ద మార్క్‌ లేదు. కెప్టెన్‌ అయిడెన మార్‌క్రమ్‌ రావడం కొండంత బలం. అతడు ఇన్నింగ్స్‌ను అభిషేక్‌, మయాంక్‌ మెరుపు ఓపెనింగ్స్‌ ఇవ్వగలరు. మిడిలార్డర్లో రాహుల్‌ త్రిపాఠి, హ్యారీ బ్రూక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఫిలిప్స్‌, సుందర్‌ బ్యాటింగ్‌ కీలకం. కెప్టెన్‌ రాకతో మిడిలార్డర్‌ పటిష్ఠం అవుతుంది. భువీ వికెట్లు తీయాలి. ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ బౌలింగ్‌ బాగుంది. కార్తీక్‌ త్యాగీకి అవకాశాలిస్తే బాగుంటుంది. ఫజల్‌ హక్‌ ఫారూఖీ బదులు జన్‌సెన్‌ రంగంలోకి దిగుతాడు. కూర్పు కుదిరితే టీమ్‌ బెటర్‌ అవుతుంది.


పిచ్‌ ఎలా ఉందంటే?


తొలి మ్యాచులో లక్నో ఏకనా పిచ ప్రవర్తన అర్థమవ్వలేదు. పేస్‌ బౌలర్లు, స్పిన్నర్లకు అనుకూలించింది. రాగానే బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. అయితే నిలబడితే సిక్సర్లు, బౌండరీలు కొట్టగలరు. అటు పేస్‌, ఇటు స్పిన్‌ను ఉపయోగపడుతుంది. బౌండరీలూ పెద్దవే. రెండు జట్లకూ సమాన అవకాశాలే ఉంటాయి. ఈ పిచ్‌పై లోకల్‌ బాయ్‌ భువీకి అనుభవం ఉంది.