Rishabh Pant Delhi Capitals: IPL 2023లో రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మిస్ అవుతున్నాడు. క్రికెట్ అభిమానుల నుంచి ఇతర IPL జట్ల ఆటగాళ్ల వరకు కూడా రిషబ్ పంత్‌ను చాలా మిస్ అవుతున్నారు.రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్. దీంతో పాటు జట్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు, మిడిలార్డర్ బ్యాటింగ్‌ రెస్పాన్సిబిలిటీస్ కూడా నిర్వహిస్తాడు.


ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మేనేజ్‌మెంట్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో అతని 17 నంబర్ జెర్సీని డగౌట్‌లో వేలాడదీయడం ద్వారా పంత్‌ను గుర్తు చేసుకుంది. ఢిల్లీ చేసిన ఈ చర్యతో బీసీసీఐ ఆగ్రహానికి లోనైంది. భవిష్యత్తులో అలా చేయవద్దని వారికి సూచించింది.


ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు వీలైతే, ఏదో ఒక విధంగా పంత్‌ను డగౌట్‌లో చేర్చడానికి జట్టు ప్రయత్నిస్తుందని చెప్పాడు. అతను అలా చేశాడు కూడా. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో పంత్ జెర్సీని వేలాడదీశారు. పంత్ జెర్సీ ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పైన వేలాడుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌పై బీసీసీఐ ఆగ్రహం
చాలా మంది అభిమానులు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఈ పనిని ప్రశంసించారు. కానీ బీసీసీఐ దీంతో ఏమాత్రం సంతోషంగా లేదు. పీటీఐ నివేదిక ప్రకారం బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ, "ఒక ఆటగాడికి పెద్ద విషాదం జరిగినప్పుడు లేదా అతను రిటైర్ అయినప్పుడు ఈ రకమైన గౌరవం చేస్తారు. రిషబ్ పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. చాలా వేగంగా కోలుకుంటున్నాడు." అంది. ఈ పనిని మంచి ఉద్దేశ్యంతోనే చేసినందున, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు తీసుకోవద్దని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ మర్యాదపూర్వకంగా సూచించింది.


ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. దీనిలో ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ బీసీసీఐ సూచనకి కట్టుబడి, రెండో మ్యాచ్‌లో జెర్సీని వేలాడదీయలేదు. అయితే రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ స్వయంగా స్టేడియానికి చేరుకున్నాడు. అతను కరచాలనం చేస్తూ ప్రేక్షకులను పలకరించాడు. వీరి చిత్రాలు సోషల్ మీడియాలో ముఖ్యాంశాలుగా మారుతున్నాయి.


ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ కు దూరమయ్యాడు. పంత్ గైర్హాజరీలో ఆసీస్ సీనియర్ బ్యాటర్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.


ఐపీఎల్ లో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ కు అపారమైన అనుభవం ఉంది. వార్నర్ దశాబ్దానికి పైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా 2016లో ట్రోఫీని అందించాడు. నాయకుడిగా, బ్యాటర్ గా ఎస్ ఆర్ హెచ్ కు ఎన్నో విజయాలు అందించాడు. అయితే 2022 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ వార్నర్ ను విడుదల చేసింది. ఆ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో వార్నర్ ఢిల్లీ ఆశలను నిలబెట్టాడు. 12 మ్యాచుల్లో 5 అర్ధసెంచరీల సాయంతో 432 పరుగులు చేశాడు. అందులో వార్నర్ అత్యుత్తమ స్కోరు 92 నాటౌట్.