IPL 2023, CSK vs LSG: 


చెన్నై సూపర్‌ కింగ్స్‌ మురిసింది! చెపాక్‌లో సొంత అభిమానులను మైమరిపించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 205/7కు పరిమితం చేసింది. మొయిన్‌ అలీ (4/26) ప్రత్యర్థి దూకుడును దెబ్బతీశాడు. కైల్‌ మేయర్స్‌ (53; 22 బంతుల్లో 8x4, 2x6) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ బాదాడు. నికోలస్‌ పూరన్‌ (32; 18 బంతుల్లో 2x4, 3x6) మెరిశాడు. అంతకు ముందు సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 31 బంతుల్లో 3x4, 4x6), డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్‌ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు.


భయపెట్టిన ఛేదన!


బిగ్‌ టార్గెట్స్‌ను ఛేజ్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి ఓపెనింగ్‌ అవసరమో కైల్‌ మేయర్స్, కేఎల్‌ రాహుల్‌ అలాగే ఆడారు. పవర్‌ప్లే ముగిసే సరికే వికెట్‌ నష్టానికి 80 పరుగులు చేశారు. విండీస్‌ విధ్వంసక ఆటగాడు మేయర్స్‌ 21 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కొట్టాడు. అతడి షాట్లకు సీఎస్‌కే భయపడిపోయింది. స్టాండ్స్‌లో అభిమానులు సైలెంట్‌గా కూర్చిండిపోయారు. అయితే 5.3వ బంతికి మొయిన్‌ అలీ అతడిని ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. జట్టు స్కోరు 82 వద్ద దీపక్‌ హుడా (2)ను శాంట్నర్‌, రాహుల్‌ (20)ను మొయిన్‌ ఔట్‌ చేసి ఒత్తిడి పెంచారు. వికెట్లు పడుతున్నా 9.1 ఓవర్లకే లక్నో 100 చేసింది. 14 ఓవర్లకు 136/5తో నిలిచింది. నికోలస్‌ పూరన్‌ భీకరమైన షాట్లు ఆడి రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. జట్టు స్కోర్‌ 156 వద్ద 15.6వ బంతికి అతడిని దేశ్‌పాండే ఔట్‌ చేసి కాన్ఫిడెన్స్‌ పెంచుకున్నాడు. ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 28గా మారింది. అయితే ఆయుష్‌ బదోనీ (23), కృష్ణప్ప గౌతమ్‌ (17*), మార్క్‌వుడ్‌ (10*) కలిసి 15 పరుగులే చేయడంతో లక్నో 205/7తో ఆగిపోయింది. 



ఈసారి కాన్వే, గైక్వాడ్‌ దూకుడు!


టాస్‌గెలిచి బౌలింగ్‌కు దిగిన లక్నోకు ఎలా బౌలింగ్‌ చేయాలో తెలియలేదు. వేగంగా లెంగ్తులను అర్థం చేసుకోలేదు. దీనిని చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే అందిపుచ్చుకున్నారు. తొలి ఓవర్‌ నుంచే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు. పవర్‌ ప్లే ముగిసే సరికే 79 పరుగులు చేశారు. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించడంతో సీఎస్‌కే 7.6 ఓవర్లకే 100కు చేరువైంది. గైక్వాడ్‌ 25 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు కాన్వే చెలరేగడంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం అందించింది. 9.1వ బంతికి గైక్వాడ్‌ను బిష్ణోయ్‌, 118 వద్ద కాన్వేను మార్క్‌వుడ్‌ ఔట్‌ చేసి బ్రేకిచ్చారు.


మధ్యలో దూబె, ఆఖర్లో రాయుడు


రెండు వికెట్లు పడ్డ తర్వాతా చెన్నై దూకుడు తగ్గలేదు. మొయిన్‌ అలీ (19) అండతో శివమ్‌ దూబె (27) దంచికొట్టాడు. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరినీ రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే బెన్‌స్టోక్స్‌ (8)ను అవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా అంబటి రాయుడు (26; 14 బంతుల్లో 2x4, 2x6) అజేయంగా నిలిచాడు. కీలక సమయాల్లో సిక్సర్లు బాదేశాడు. ఎంఎస్ ధోనీ (12) సైతం రెండు సిక్సర్లు బాది ఫ్యాన్స్‌ను అలరించాడు. దాంతో స్కోరు 217/7కు చేరుకుంది. సీఎస్కే ఆరంభాన్ని చూస్తే స్కోరు 240 దాటేలా కనిపించింది.