IPL 2023, CSK vs LSG: 


లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇరగదీసింది! హోమ్‌ క్రౌడ్‌ను ఆనందంలో ముంచెత్తించింది. చెపాక్‌లో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించింది. ఈ సీజన్లోనే అత్యధిక స్కోరు సాధించింది. 7 వికెట్లు నష్టపోయి రాహుల్‌ సేనకు 218 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 31 బంతుల్లో 3x4, 4x6) వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదేశాడు. డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5x4, 2x6), శివమ్‌ దూబె (26; 13 బంతుల్లో 2x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశారు.






కాన్వే, గైక్వాడ్‌ దంచికొట్టుడు!


టాస్‌గెలిచి బౌలింగ్‌కు దిగిన లక్నోకు ఎలా బౌలింగ్‌ చేయాలో తెలియలేదు. వేగంగా లెంగ్తులను అర్థం చేసుకోలేదు. దీనిని చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే అందిపుచ్చుకున్నారు. తొలి ఓవర్‌ నుంచే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు. పవర్‌ ప్లే ముగిసే సరికే 79 పరుగులు చేశారు. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించడంతో సీఎస్‌కే 7.6 ఓవర్లకే 100కు చేరువైంది. గైక్వాడ్‌ 25 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు కాన్వే చెలరేగడంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం అందించింది. 9.1వ బంతికి గైక్వాడ్‌ను బిష్ణోయ్‌, 118 వద్ద కాన్వేను మార్క్‌వుడ్‌ ఔట్‌ చేసి బ్రేకిచ్చారు.




మధ్యలో దూబె, ఆఖర్లో రాయుడు


రెండు వికెట్లు పడ్డ తర్వాతా చెన్నై దూకుడు తగ్గలేదు. మొయిన్‌ అలీ (19) అండతో శివమ్‌ దూబె (27) దంచికొట్టాడు. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరినీ రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే బెన్‌స్టోక్స్‌ (8)ను అవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా అంబటి రాయుడు (26; 14 బంతుల్లో 2x4, 2x6) అజేయంగా నిలిచాడు. కీలక సమయాల్లో సిక్సర్లు బాదేశాడు. ఎంఎస్ ధోనీ (12) సైతం రెండు సిక్సర్లు బాది ఫ్యాన్స్‌ను అలరించాడు. దాంతో స్కోరు 217/7కు చేరుకుంది. సీఎస్కే ఆరంభాన్ని చూస్తే స్కోరు 240 దాటేలా కనిపించింది.