IPL 2023 – MS Dhoni CSK Captain: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌కు ధోనీ సారథ్యంలో సీఎస్కే ఆడుతుందని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం కాశీ విశ్వనాథ్ వెల్లడించాడని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ క్లారిటీ..
ఐపీఎల్ 2023 సీజన్ కోసం మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. కెప్టెన్సీ విషయంలో మేమెప్పుడూ మార్పును కోరుకోలేదు అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు ఐపీఎల్ 2023కి కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశారు. ఎంఎస్ ధోనీ విజయవంతమైన ఐపీఎల్ ఆటగాడు, కెప్టెన్ అని ప్రశంసల జల్లులు కురిపించాడు.
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. కానీ సీజన్ లో CSK ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరింటిలో ఓడిపోవడంతో కొత్త కెప్టెన్ కోసం చూడగా.. ధోనీకే మళ్లీ పగ్గాలు అప్పగించారు. జడేజా కోరిక మేరకు ధోనీ ఫ్రాంచైజీ కోసం మరోసారి జట్టును గాడినపెట్టే బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. గత సీజన్‌లో చివరి మ్యాచ్ లో ధోనీ మాట్లాడుతూ వచ్చే సీజన్‌లో కనిపిస్తానని చెప్పి, ఐపీఎల్ 2023 కోసం వేచి చూడాలంటూ తన ఫ్యాన్స్ కు సంకేతాలిచ్చాడు. వచ్చే సీజన్‌లోనూ ధోనీనే సీఎస్కే సారథి అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పడంతో చెన్నై టీమ్ ఫ్యాన్స్, ధోనీ ఫ్యాన్స్ సంతోషంతో విజిల్ వేస్తున్నారు.
ధోనీ కూడా సిగ్నల్ ఇచ్చాడు..
వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కొన్ని నెలల కిందట ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు. గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతామని.. చెన్నై వేదికగా మ్యాచ్ లు జరగకపోవడం సీఎస్కే అభిమానులను నిరాశకు గురిచేసిందన్నాడు. ముంబై వేదికగా ఆడటాన్ని కూడా తాను ఎంతో ప్రేమిస్తానని చెబుతూ.. ఐపీఎల్ 2023లో తాను మైదానంలోకి దిగడం కన్ఫామ్ అని స్పష్టం చేశాడు మహీ.