SRH New Coach: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించుకుంది. విండీస్‌ గ్రేట్‌, ఇప్పటికే బ్యాటింగ్‌ సలహాదారుగా ఉన్న బ్రియన్‌ లారాను కోచ్‌గా ఎంపిక చేసింది. టామ్‌ మూడీకి థాంక్యూ చెప్పేసింది! చివరి సీజన్లో జట్టు ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.


అప్పట్లో బలమైందే!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఒకప్పుడు బలమైన జట్టు! ప్రతి సీజన్లోనూ ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చేది. 2016లో విజేతగా అవతరించింది. ఆ తర్వాత రెండు సీజన్లలో ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. మంచి బ్యాటింగ్‌కు తోడు బలమైన బౌలింగ్‌ లైనప్‌ ఫ్రాంచైజీ థీమ్‌గా ఉండేది. అలాంటిది రెండేళ్లుగా అనూహ్య నిర్ణయాలు, పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఘోరంగా అనిపించింది.


చెత్త వ్యూహాలు


చివరి సీజన్లో సన్‌రైజర్స్‌ ఆటతీరుపై ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది! జట్టుకు కొండంత బలమైన డేవిడ్‌ వార్నర్‌ను వదిలేసుకుంది. అతడితో మనస్పర్థలను తొలగించుకోలేదు. మళ్లీ అంతటి ఆటగాడినైనా వేలంలో తీసుకోలేదు. వేలంలో స్టార్లు, కీలక ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలు దక్కించుకుంటుంటే కళ్లప్పగించి చూసింది. చివరికి సాధారణ, అనుభవం లేని ఆటగాళ్లనే ఎంచుకుంది. వన్‌డౌన్‌లో అత్యంత కీలకమైన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఓపెనర్‌గా పంపించింది. ఓపెనింగ్‌లో అదరగొట్టే రాహుల్‌ త్రిపాఠిని వన్‌డౌన్‌, సెకండ్‌ డౌన్‌లో ఆడించింది. మిడిలార్డర్లో నికోలస్‌ పూరన్‌ మినహా ఫినిషర్లు కనిపించ లేదు. ఇక బౌలింగ్‌లోనూ పస లేదు. మొత్తంగా 14 మ్యాచులాడి 6 విజయాలు, 8 పరాజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.


కొంప ముంచిన నాయకత్వ సంఘర్షణ?


రెండేళ్ల క్రితం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టామ్‌ మూడీని తొలగించి ట్రెవర్‌ బేలిస్‌ను కోచ్‌గా తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీజన్లో బేలిస్‌ను కోచ్‌గా, మూడీని పర్యవేక్షకుడిగా ఎంచుకున్నారు. వీరిద్దరూ ఉన్నప్పుడే సరైన ఆటగాళ్లను ఇవ్వడం లేదని వార్నర్‌ బహిరంగంగా విమర్శించాడు. అప్పుడే జట్టులో ముసలం మొదలైంది. కెప్టెన్‌గా వార్నర్‌ను తొలగించి కనీసం జట్టులో చోటివ్వలేదు. పైగా కుర్రాళ్లకు అనుభవం వస్తుందని అతడిని స్టేడియానికి రాకుండా హోటల్‌ గదిలోనే ఉంచేశారు. ఇక చివరి సీజన్లో కోచ్‌గా మూడీ, బ్యాటింగ్‌ సలహాదారుగా లారా, బౌలింగ్‌ కోచ్‌గా స్టెయిన్‌ను ఎంచుకున్నా లాభం లేకపోయింది. దాంతో ఇప్పుడు మూడీని తొలగించి లారాకు బాధ్యతలు అప్పగించారు.