Punjab Kings Head Coach: టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లేకు (Anil Kumble) పంజాబ్ కింగ్స్‌ షాకివ్వబోతోందని సమాచారం! కోచ్‌ పదవి నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్టు తెలిసింది. ఒప్పందం ముగుస్తున్నా పునరుద్ధరించుకొనేందుకు ఆసక్తి చూపించడం లేదట. కొత్త కోచ్‌ కోసం ఇప్పటికే ముగ్గుర్ని సంపద్రించినట్టు తెలుస్తోంది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో 15 సీజన్లు ముగిశాయి. ఇప్పటి వరకు ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచులు ఎంతో మంది మారారు. అయినప్పటికీ ఒక్కసారైనా ట్రోఫీ ముద్దాడలేదు. రెండు సార్లు ఫైనల్‌ చేరింది. ఈ సీజన్లో విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్ లివింగ్‌స్టన్‌, కాగిసో రబాడా, మయాంక్‌ అగర్వాల్‌ వంటి సీనియర్లను తీసుకున్నా పేలవ ప్రదర్శనే చేసింది. రీటెయిన్‌ చేసుకుంటామన్నా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరో జట్టుకు వెళ్లిపోవడంతో పంజాబ్‌ ఫ్రాంచైజీ వాతావరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అపజయాలు ఎదురవ్వడంతో కుంబ్లేపై విశ్వాసం పోయింది. ఆయన నేతృత్వంలో పంజాబ్‌ కింగ్స్‌ 42 మ్యాచులు ఆడగా 19 మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో 14 మ్యాచులాడి ఆరో స్థానంలో నిలిచింది.


గొప్ప ప్రదర్శనేమీ చేయకపోవడంతో అనిల్‌ కుంబ్లేతో బంధం ముగించాలని పంజాబ్‌ కింగ్స్‌ భావిస్తోంది. సెప్టెంబర్‌తో మూడేళ్ల ఒప్పందం ముగుస్తుంది. దాంతో ఇయాన్‌ మోర్గాన్‌, ట్రెవర్‌ బేలిస్‌ సహా టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ ఒకరిని కోచింగ్‌ పదవి కోసం సంప్రదించినట్టు తెలిసింది. వారం రోజుల్లోనే కొత్త కోచ్‌ నియామకంపై స్పష్టత వస్తుందని ఆ ప్రాంచైజీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.


'సెప్టెంబర్‌తో మూడేళ్ల ఒప్పందం ముగుస్తుండటంతో అనిల్‌ కుంబ్లేను తిరిగి తీసుకోవద్దని మొహాలీ జట్టు నిర్ణయించుకుంది. ఇప్పటికే అర్హులైన వారిని వెతుకుతున్నారు. ఇయాన్‌ మోర్గాన్‌, ట్రెవర్‌ బేలిస్‌, టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ ఒకర్ని సంప్రదించారని తెలిసింది. వారిలో ఎవరో ఒకర్ని కోచ్‌గా తీసుకోవచ్చు. లేదా మరొకర్ని వెతకొచ్చు. మరో వారం రోజుల్లో ఎవరో ఒకర్ని నిర్ణయిస్తామని పంజాబ్‌ కింగ్స్‌ ప్రతినిధి తెలిపారు' అని క్రిక్‌బజ్‌ రిపోర్టు చేసింది.