IPL 2023, Virat Kohli - Sourav Ganguly: 


తనను ట్రోల్‌ చేస్తున్న వారికి సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) దిమ్మదిరిగే షాకిచ్చాడు! ఇంగ్లిష్‌ అర్థమవ్వకపోతే టీచర్‌తో ట్యూషన్‌ పెట్టించుకోండని ఘాటుగా విమర్శించాడు. తన మాటలను ఎందుకు ట్విస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించాడు. ఎందుకంటారా?


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో ఆఖరి మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) మధ్య జరిగింది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) వరుసగా రెండో సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్‌ అద్వితీయమైన సెంచరీ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. కోహ్లీ శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాడు.




మ్యాచ్ ముగిశాక శుభ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల జల్లు కురిసింది. అలాగే విరాట్‌ కోహ్లీ సెంచరీనీ చాలా మంది పొగిడాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సైతం ట్వీట్‌ చేశాడు. 'ఈ దేశంలో ఎంత ప్రతిభ దాగుందో కదా! శుభ్‌మన్‌ గిల్‌.. వావ్‌.. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు కూడా.. ఐపీఎల్‌.. గొప్ప ప్రమాణాలు ఉన్నాయి ఈ టోర్నీలో' అంటూ దాదా పోస్టు చేశాడు.


ఈ ట్వీట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను నేరుగా విరాట్‌ కోహ్లీని పరోక్షంగా ప్రస్తావించాడు గంగూలీ! ఇది చాలామంది కోహ్లీ అభిమానులకు నచ్చలేదు. అతడి పేరు రాయలేదని కోప్పడ్డారు. దాదాపై అనవసర విమర్శలకు దిగారు. దాంతో మళ్లీ అతడే నేరుగా బరిలోకి దిగాడు. 'క్విక్‌ రిమైండర్‌! ఈ ట్వీట్‌ను ట్విస్ట్‌ చేస్తున్నవాళ్లకు ఇంగ్లిష్ అర్థమవుతుందనే అనుకుంటున్నా! లేదంటే ఎవరితోనైనా అర్థమయ్యేలా చెప్పించుకోండి' అని రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు.




ఈ సీజన్లో కింగ్‌ కోహ్లీ 14 మ్యాచుల్లో 139.82 స్ట్రైక్‌రేట్‌తో 639 పరుగులు చేశాడు. ఏకంగా రెండు సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు కొట్టేశాడు. 65 బౌండరీలు, 16 సిక్సర్లు బాదాడు. అయితే ఆర్సీబీని ప్లేఆఫ్ చేర్చలేక పోయాడు. ఇదే సమయంలో కొన్ని మ్యాచుల్లో ఎక్కువ యానిమేటెడ్‌గా కనిపించాడు. దూకుడుగా ఉండే క్రమంలో టీమ్‌ఇండియా సహచరులు, గౌతమ్ గంభీర్‌, నవీనుల్‌ హఖ్‌ వంటి వారిని కవ్వించాడు. దిల్లీ మ్యాచులోనూ ఇలాగే జరిగింది.


ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆడేటప్పుడు విరాట్‌ కోహ్లీని సౌరవ్‌ గంగూలీ పెద్దగా పట్టించుకోలేదు. అతడి వైపు చూడకుండా వెళ్లిపోయాడు. అదే సమయంలో దాదాను.. కోహ్లీ కోపంగా చూశాడు. మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లు హ్యాండ్‌ షేక్‌ చేస్తున్న సమయంలో దాదాను తప్పించుకొని వేరేవాళ్లకు ఇచ్చాడు. ఇది దుమారంగా మారింది. ఇద్దరి అభిమానులూ ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. అయితే రెండో మ్యాచ్‌లో ఇద్దరూ హ్యాండ్‌ షేక్‌ ఇచ్చుకోవడం వివాదానికి అక్కడితో ఫుల్‌స్టాప్‌ పడింది.


ఈ సీజన్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మోస్తరు ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలబడింది. 14 మ్యాచుల్లో 7 గెలిచి 7 ఓడింది. 0.135 రన్‌రేట్‌, 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు దూరమైంది. అయితే విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ మాత్రం అదరగొట్టారు. ఇప్పటి వరకైతే పరుగుల పరంగా టాప్‌-3లో నిలిచారు.