IPL 2023 Auction Venue: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది మెగా వేలం కాదు.
మినీ వేలం. గత వేలంలో తమ పర్సులో డబ్బు మిగిలిన వారు, ఇప్పుడు విడుదల చేసే ఆటగాళ్ల విలువకు తోడు జట్లకు అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు సమాచారం.
పంజాబ్ వద్ద ఎక్కువ డబ్బు
2022లో జరిగిన మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ. 3.45 కోట్ల డబ్బు మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 1.55 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ రూ. 95 లక్షలు, కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 45 లక్షలు, గుజరాత్ టైటాన్స్ రూ. 15 లక్షలతో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ వద్ద తలా రూ. 10 లక్షలు మిగిలాయి. లక్నో సూపర్ జెయింట్స్ పర్సు మొత్త ఖాళీ అయిపోయింది.
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ 2022 వేలంలో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేశాయి. మరో విదేశీ ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉన్నందున ఈ జట్లు వేరే దేశం ప్లేయర్స్ పై ఆసక్తి చూపించవచ్చు. గత సీజన్ లో కొన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు గాయపడినందున వారి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకున్నాయి. ఇప్పుడు వారిలో రీప్లేస్ మెంట్ ఆటగాడిని ఉంచుకోవాలా లేదా అసలు వేలంలో కొనుక్కున్న ఆటగాడిని ఉంచుకోవాలా అని ఫ్రాంచైజీలు నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఆటగాళ్ల పరిమితిని పెంచినట్లయితే ఇద్దరిని ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా వేలం
2022 ఐపీఎల్ టైటిల్ ను హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలిసారిగా గెలుచుకుంది. అరంగేట్ర సీజన్ లోనే కప్పును ఎగరేసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా వేలం జరిగింది. ఇందులో గరిష్టంగా 217 స్లాట్‌లలో 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వేలంలో రూ.551.7 కోట్లు వెచ్చించారు. 107 మంది క్యాప్ ప్లేయర్లు, 97 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 137 మంది భారత ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయగా, 67 మంది విదేశీ ఆటగాళ్లు వివిధ జట్టుల్లోకి వచ్చారు.