Ravindra Jadeja, IPL 2023: ఇండియన్ ప్రీమియర్‌ లీగులో రవీంద్ర జడేజా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది! చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రీటెయిన్‌ చేసుకుంటుందో రిలీజ్‌ చేస్తుందో ఇప్పటికీ అర్థమవ్వడం లేదు. అక్షర్‌ పటేల్‌, శుభ్‌మన్‌ గిల్‌తో అతడిని ట్రేడ్‌ చేసుకుంటారని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైలు అతడి కోసం సంప్రదించాయని వదంతులు వ్యాపించాయి. తీరా చూస్తే సీఎస్‌కే జడ్డూను వదులుకొనే సూచనలు కనిపించడం లేదు.


ధోనీ ఆదేశం!


సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్‌లోనే ఉండాలని కెప్టెన్‌ ఎంస్‌ ధోనీ కోరుకుంటున్నట్టు తెలిసింది. అతడిని వేలంలోకి పంపించొద్దని జట్టు యాజమాన్యానికి స్పష్టం చేశాడని సమాచారం. ముఖ్యంగా చెపాక్‌ పిచ్‌పై అతడి స్థాయిలో మరెవ్వరూ ప్రభావం చూపించలేరని మహీ నమ్ముతున్నాడు. కొన్నేళ్లుగా సీఎస్‌కే విజయాల్లో అతడు పాత్ర అత్యంత కీలకమని చెప్పాడట. అక్షర్‌ పటేల్‌ లేదా ఇతర ఆటగాళ్లని జడ్డూ స్థానంలో తీసుకొనేందుకు ఎంఎస్‌డీ ఇష్టపడటం లేదని తెలిసింది.


కెప్టెన్సీతో విభేదాలు


ఐపీఎల్‌ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు జడ్డూ సారథ్యం వహించాడు. రూ.16 కోట్లకు అతడిని ఫ్రాంచైజీ రీటెయిన్‌ చేసుకుంది. కీలక ఆటగాళ్లు లేకపోవడం, ప్లానింగ్‌ లోపాలతో సీఎస్‌కే అంచనాల మేరకు రాణించలేదు. దాంతో తన ఆటపై దృష్టి కేంద్రీకరించేందుకు నాయకత్వ బాధ్యతలు వదిలేస్తున్నట్టు జడ్డూ చెప్పాడు. ఆ తర్వాత గాయపడటం, టోర్నీ మొత్తానికీ దూరమవ్వడం తెలిసిందే. అయితే ఉద్దేశపూర్వకంగానే అతడిని సీఎస్‌కే బయటకు పంపించినట్టు వార్తలు వచ్చాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కేను అన్‌ఫాలో అవ్వడం, ఆ జట్టుకు సంబంధించిన పోస్టులన్నీ తొలగించడం నిజమే అనుకునేలా చేశాయి. ఇన్నాళ్లు గాయంతో దూరమైన జడ్డూ తిరిగి టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేస్తున్నాడు.


నవంబర్‌ 15 చివరి తేదీ


ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేసేందుకు, ట్రేడ్‌ చేసుకొనేందుకు నవంబర్‌ 15 చివరి తేదీ. ఇప్పటి వరకు జడ్డూ, సీఎస్‌కే యాజమాన్యం మధ్య మాటల్లేవని తెలిసింది. అందుకే వచ్చే సీజన్లో అతడెవరికి ఆడతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా క్రిస్‌ జోర్డాన్‌, ఆడమ్‌ మిల్నేను సీఎస్‌కే విడిచిపెట్టనుందని తెలిసింది.