IPL 2023 Auction:  ఐపీఎల్ వేలానికి సన్నాహకాలు మొదలయ్యాయి. డిసెంబర్ 23న కొచ్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం జరగనుంది. ఈ వేలంలో 273 మంది భారత ఆటగాళ్లు, 132 మంది విదేశీ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 87 స్లాట్ ల కోసం 405 మంది బరిలో ఉన్నారు. 


ఐపీఎల్ 2023 కోసం మినీ వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా సిద్ధం అయ్యింది. 273 మంది దేశీయ, 132 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో 119 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 282 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. ఆయా ఫ్రాంచైజీల్లో మొత్తం 87 స్లాట్ లు ఖాళీగా ఉన్నాయి. 30 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఓవర్సీస్ కు చెందిన 19మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో బరిలోకి దిగనున్నారు. రూ. 1.5 కోట్లు బేస్ ధరతో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. కోటి రూపాయల బేస్ ధరతో 20 మంది బరిలో ఉన్నారు. అందులో ఇద్దరు భారత ఆటగాళ్లు మనీష్ పాండే, మయాంక్ అగర్వాలు కూడా ఉన్నారు. 






ఏ జట్టుకు ఎన్ని ఖాళీలున్నాయంటే!


హైదరాబాద్‌ దగ్గర అన్ని జట్లలోకి తక్కువ మంది ఆటగాళ్లు, ఎక్కువ ఖాళీ స్లాట్‌లు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీ పర్స్‌లోనూ భారీగా నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం 12 మంది ఆటగాళ్లు ఉండగా.. మరో 13 స్లాట్‌లు ఖాళీ. వీటి కోసం రూ. 42.25 కోట్ల సొమ్ముతో ఆ జట్టు వేలంలోకి దిగనుంది. చెన్నై వద్ద రూ. 20.45 కోట్లు ఉండగా 7 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబయి జట్టులో 9 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వారి వద్ద 20. 55 కోట్ల పర్సు ఉంది. కోల్ కతా దగ్గర కేవలం రూ. 7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ వారి వద్ద 11 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. బెంగళూరు జట్టులో 7 స్లాట్లు ఖాళీగా ఉండగా.. రూ. 8.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. దిల్లీ జట్టు వద్ద రూ.19.45 కోట్లు పర్సు ఉంది. ఆ జట్టులో 5 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్ వద్ద 13. 20 కోట్లు ఉన్నాయి. ఇంకా 9 సాట్లు ఖాళీగా ఉన్నాయి. పంజాబ్ జట్టులో 9 ఖాళీలు ఉండగా.. 32. 3 కోట్లు వారి వద్ద ఉన్నాయి. గుజరాత్, లఖ్ నవూ వద్ద వరుసగా 19.25 కోట్లు, 23.35 కోట్లు పర్సు ఉంది. గుజరాత్ లో 7 సాట్లు, లఖ్ నవూ వద్ద 10 సాట్లు ఖాళీగా ఉన్నాయి.