ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పదేపదే విఫలమవుతుండటం అభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది! పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచులో ఔటయ్యాక కోహ్లీ ఆకాశం వైపు చూస్తూ దేవుడికి మొరపెట్టుకోవడం అందర్నీ కలచివేసింది. ఒకప్పుడు పరుగుల యంత్రంగా పేరుపొందిన అతడు ఇప్పుడిలా అవ్వడం బాధిస్తోంది!


ఐపీఎల్‌ 2022లో శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (PBKS vs RCB) తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బెంగళూరు ఛేదన సాఫీగానే సాగుతుందని అంతా భావించారు. ఓపెనింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ సైతం చక్కని షాట్లు ఆడాడు. చకచకా పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరు 33 వద్ద రబాడా షార్ట్‌పిచ్‌లో వేసిన 3.2వ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఆ బంతి తన చేతి గ్లోవ్స్‌ను ముద్దాడి అతడి రిబ్స్‌కు తాకి ఫైన్‌ లెగ్‌లో రాహుల్‌ చాహర్‌ చేతుల్లో పడింది.


భారీ స్కోరు చేస్తాడని భావించిన కోహ్లీ 14 బంతుల్లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో కేవలం 20 పరుగులే చేశాడు. వెళ్లేటప్పుడు కోహ్లీ నిర్వేదం చూస్తే జాలేసింది. నడుచుకుంటూ ఆకాశం వైపు చూస్తూ.. 'దేవుడా, నా ఫామ్‌ ఇంకెప్పుడు తిరిగిస్తావు' అన్నట్టుగా గట్టిగా అరిచాడు. తల అడ్డంగా ఊపుకుంటూ పెవిలియన్‌ చేరుకున్నాడు. టీవీ స్క్రీన్లపై ఈ సీన్‌ చూసిన అతడి అభిమానులకు కన్నీరొచ్చింది. భగవంతుడు కచ్చితంగా అతడి మొర ఆలకించాలని కోరుతూ వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.






ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్‌స్టో (66: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. లివింగ్‌స్టోన్ (70: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఎప్పటిలాగే చెలరేగి ఆడాడు.