IPL 2022 Once I leave here I wont be praising Bairstow says liam livingstone : ఐపీఎల్‌లో అత్యంత కీలక సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించామని పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టన్ అంటున్నాడు. జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఓపెనింగ్ అద్భుతమని ప్రశంసించాడు. ఇంగ్లాండ్‌కు వెళ్లాక మాత్రం అతడిని అస్సలు పొగడనని అంటున్నాడు.
'నా మోకాలి కండరాలు పట్టేశాయి. అందుకే బయటకు వెళ్లి ముందు జాగ్రత్తగా ఐస్‌తో రుద్దుకున్నాను. గాయాన్ని మరింత పెద్దది చేయడం నాకిష్టం లేదు. ఈ మ్యాచులో జానీ అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. మిగిలిన వారి కోసం మూమెంటమ్ సృష్టించాడు. ముందుగానే రావడంతో పిచ్, బౌలర్లు, మ్యాచు పరిస్థితులను తెలుసుకొనేందుకు సమయం దొరికింది. నేను రావడానికి ముందే జానీ దంచికొట్టడం బాగా అనిపించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మా బౌలర్లు తిరుగులేని బౌలింగ్ చేశారు' అని లివింగ్‌స్టన్ అన్నాడు.
'మేం 200+ స్కోరు చేసినా మరో 10-15 పరుగులు తక్కువే చేసినట్టు అనిపించింది. ఎందుకంటే బౌండరీ పరిమాణం తక్కువగా ఉంది. అందుకే మా బౌలర్లు ప్రత్యర్థిపై ఎక్కువ ప్రెజర్ పెట్టారు. వారిపై మేం ఒత్తిడి పెంచేందుకు అవకాశం తీసుకోవాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టే జానీ అదరగొట్టాడు. అయితే ఇంగ్లాండ్ (లాంకాషైర్- యార్క్‌షైర్ శత్రుత్వం ఎక్కువ) వెళ్లాక మాత్రం అతడిని నేనిలా పొగడను. అక్కడికెళ్తే నాది డిఫరెంట్ రోల్. మ్యాచును బట్టి నన్ను ముందు, వెనక పంపిస్తున్నారు. అందుకు తగ్గట్టే నేను రాణిస్తున్నాను. పంజాబ్‌కు మ్యాచులు గెలిపిస్తున్నందుకు సంతోషంగాఉంది. ఏ బ్యాటింగ్ ఆర్డర్లోనైనా వచ్చి రాణించే సత్తా నాకుంది' అని లివింగ్‌స్టన్ అన్నాడు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్‌స్టో (66: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. లివింగ్‌స్టోన్ (70: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఎప్పటిలాగే చెలరేగి ఆడాడు.