Why Ms Dhoni choose Ravindra Jadeja as new captain: ఎంఎస్ ధోనీ (MS Dhoni).. క్రికెట్లో ఒక మాస్టర్ మైండ్! ఈ ఆటలో ప్రపంచానికి దొరికిన స్థిత ప్రజ్ఞుడు! అతడు ఏం చేసినా? ఎందుకు చేసినా? దాని వెనక ఎంతో లాజిక్ ఉంటుంది. ఊహించని సస్పెన్స్ ఉంటుంది. అంతకు మించిన థాట్ ప్రాసెస్ ఉంటుంది. సీఎస్‌కేలో ఎంతో మంది ఉండగా రవీంద్ర జడేజాకే ఎందుకు పగ్గాలు అప్పగించాడు! అతడిలోని స్పెషాలిటీ ఏంటి? జడ్డూలో ధోనీకి ఏం నచ్చుంటుంది!!
జడ్డూ పదేళ్లు ఆడగలడు
ఐపీఎల్‌లో సీఎస్‌కే (CSK) అత్యుత్తమ జట్టు. ఆరంభ సీజన్ నుంచీ ఒక్కసారి తప్పా ప్రతిసారీ ప్లేఆఫ్ చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం వారి కోర్ టీమ్! కీలక ఆటగాళ్లంతా ఇందులో ఉంటారు. ఈ సీజన్ వేలానికి ముందే పదేళ్ల వరకు జట్టుకు సేవలందించే వాళ్లను సీఎస్‌కే ఎంచుకోవాలని అనుకుంది. ప్రపంచ క్రికెట్లోనే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అత్యుత్తమ అథ్లెట్! అతడి ఫిట్‌నెస్‌కు తిరుగులేదు. కనీసం మరో 10 ఏళ్లు క్రికెట్ ఆడగలడు.
3 ఫార్మాట్లలో కేక
ఒకప్పుడు జడ్డూను (Jaddu) టెస్టు, వన్డేల్లోనే ప్రధాన ఆల్‌రౌండర్‌గా భావించేవాళ్లు. రిస్ట్ స్పిన్నర్ల రాకతో రెండేళ్లు అతడికి జట్టులో చోటు దొరకలేదు. ఇదే సమయంలో అతడు తనలోని టీ20 స్కిల్స్‌ను మరింత పదును పెట్టుకున్నాడు. బ్యాటింగ్‌ను ఇంఫ్రూవ్ చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
మ్యాచ్ విన్నర్‌గా Jaddu
రెండేళ్ల నుంచి జడ్డూ బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ విన్నర్ అవతారం ఎత్తాడు. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చి ఆఖరి వరకు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ అవసరాన్ని బట్టి సిక్సర్లు బాదేస్తున్నాడు. గత సీజన్లో ఒక ఓవర్లోనే జడ్డూ 37 పరుగులు సాధించాడు. చాలా మ్యాచుల్లో చెన్నై విజయాలకు కారకుడిగా నిలిచాడు. పైగా లెఫ్ట్ హ్యాండర్ కావడం ప్లస్ పాయింట్.
లీడర్‌షిప్ మెంటాలిటీ
రవీంద్ర జడేజాది సాధారణంగానే నాయకత్వ దృక్పథం ఉన్న మనస్తత్వం! పైగా చాలా కష్టపడతాడు. తన నైపుణ్యాలను మరింత సానపెట్టుకొనేందుకు ట్రై చేస్తుంటాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నప్పుడే షేన్ వార్న్ అతడిని రాక్‌స్టార్ అని పిలిచాడు.
Jadduని మించి లేరు
ఇప్పుడు సీఎస్‌కే కోర్ టీమ్‌లో (CSK core team) జడ్డూకు తొలి ప్రాధాన్యం! అందుకే అతడిని రూ.16 కోట్లకు రీటెయిన్ చేసుకున్నారు. సాధారణంగా సీఎస్‌కే ఎప్పుడూ భారతీయులకే కెప్టెన్సీ ఇస్తుంది. ఎంఎస్ ధోనీ లేని పక్షంలో సురేశ్ రైనా ఆ బాధ్యతలు తీసుకున్నాడు. రుతురాజ్ యువకుడు. అంబటి రాయుడు వంటివాళ్లు కెరీర్ చివరి దశల్లో ఉన్నారు. అందుకే జడ్డూను మించి ఎవరూ కనిపించలేదు.
IPL గణాంకాల్లో మేటి
ఐపీఎల్‌లో జడ్డూకు సుదీర్ఘ అనుభవం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డిపార్టుమెంట్లలో తిరుగులేదు. 151 ఇన్నింగ్సుల్లో 63సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 128 స్ట్రైక్‌రేట్‌తో 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు తీశాడు. 79 క్యాచులు అందుకున్నాడు. అందుకే జడ్డూను ఎంపిక చేసుకున్నారు.
Also Read: ధోనీ ది గ్రేట్! తలా.. నీ రికార్డులు తలదన్నేవారే లేరు!
Also Read: మళ్లీ షాకిచ్చిన ధోనీ! జడ్డూకు CSK కెప్టెన్సీ అప్పగించిన మిస్టర్ కూల్!