మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మళ్లీ షాకిచ్చాడు! ఐస్‌లా కూల్‌గా ఉంటూనే మరోసారి పెద్ద బాంబు పేల్చాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. సీఎస్‌కే పగ్గాలను రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) అప్పగించాడు. ఐపీఎల్‌ 2022 నుంచి జడ్డూనే ఈ అత్యుత్తమ జట్టును నడిపించనున్నాడు. మహీ ఇకపై సాధారణ క్రికెటర్‌లా జట్టుకు ఆడతాడు. సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.







'చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఎంఎస్‌ ధోనీ నిర్ణయించాడు. జట్టును నడిపించేందుకు రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. 2012 నుంచి జడ్డూ సీఎస్‌కేలో అంతర్భాగంగా ఉన్నాడు. ఈ జట్టును నడిపించే మూడో కెప్టెన్‌ అతడు. ధోనీ ఈ సీజన్లో, ఇకపైనా చెన్నై సూపర్‌కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తాడు' అని సీఎస్‌కే ప్రకటించింది. మొత్తంగా నాలుగు సార్లు చెన్నైని ధోనీ ఛాంపియన్‌గా నిలబెట్టాడు.


ఐపీఎల్‌ 15వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ధోనీ 40 ఏళ్లకు చేరువయ్యాడు. ఇంకెన్నాళ్లు  క్రికెట్‌ ఆడతాడో చెప్పలేని పరిస్థితి. అతడు ఫిట్‌గా ఉన్నప్పటికీ భవిష్యత్తును ఆలోచించి మరొకరికి కెప్టెన్సీ అప్పగించాడు. ఐపీఎల్‌ మెగా వేలం ఆరంభమవ్వడానికి ముందు నుంచే ధోనీ భవితవ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. బహుశా అతడికి ఇదే చివరి సీజన్‌ అని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. భవిష్యత్తు కెప్టెన్‌గా జడ్డూను ఎంపిక చేస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేశారు. బహుశా వచ్చే ఏడాది అతడికి పగ్గాలు అప్పగిస్తారని అనుకున్నారు.


వీరందరికీ ధోనీ ఎప్పటిలాగే షాకిచ్చాడు. వచ్చే సీజన్‌ దాకా ఆగలేదు. ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి రెండు రోజులు ముందే కెప్టెన్సీకి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ ఏడాది సీఎస్‌కే నలుగురు ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకుంది. విచిత్రంగా తొలి ప్రాధాన్యాన్ని రవీంద్ర జడేజాకు ఇచ్చింది. రూ.16 కోట్లు అతడికి చెల్లిస్తోంది. ఎంఎస్ ధోనీకి రూ.12 కోట్లే ఇస్తోంది. తన ధరను అతడే తగ్గించుకున్నాడని చెప్పింది. దాంతోనే ధోనీ భవితవ్యంపై అందరికీ అనుమానాలు రేకెత్తాయి.