Sourav Ganguly pushpa dance: అల్లు అర్జున్ నటించిన 'పుష్ఫ' (Pushpa - the rise) ఫీవర్ ఇంకా తగ్గడం లేదు! సినిమా విడుదలై మూడు నెలలు కావస్తున్నా సెలెబ్రిటీలు ఇంకా 'పుష్ఫ' స్టెప్పులు, డైలాగులను రీక్రియేట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 'శ్రీ వల్లి' (Srivalli song) పాటకు డ్యాన్స్ చేసి అలరించాడు.
పుష్ఫలోని 'తగ్గేదే లే' డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. హిందీలో ఇదే డైలాగ్‌ను 'ఝుకేగా నహీ'గా రాశారు. దేశవ్యాప్తంగా రిలీజైన పుష్ఫ మూవీ రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పులను అంతా రీక్రియేట్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja), డేవిడ్ వార్నర్ (David Warner), డ్వేన్ బ్రావో, విరాట్ కోహ్లీ (Virat Kohli), షకిబ్ అల్ హసన్ సహా ఎంతో మంది పుష్పలా చేసి అలరించారు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వీరికి జత కలిశాడు.
జీ బంగ్లా టీవీలో గంగూలీ 'దాదా గిరి అన్‌లిమిటెడ్' షోకు హోస్ట్‌గా చేస్తున్నాడు. లేటెస్టు ఎపిసోడ్‌లో ఇద్దరు చిన్నారులను అతడు హోస్ట్ చేశాడు. ఓ కుర్రాడు 'ఝుకేగా నహీ' అంటూ అదరగొట్టాడు. దాంతో వారితో కలిసి గంగూలీ 'శ్రీవల్లి' స్టెప్స్ వేశాడు. 'ఝుకేగా నహీ' అంటూ చేతిని తిప్పాడు. ఇప్పుడీ ఎపిసోడ్ ప్రోమో వైరల్‌గా మారింది. అంతకు ముందూ ఓ ఎపిసోడ్‌లో 'అల్లు అర్జున్'చేసిన ట్వీట్‌పై ఒకరిని ప్రశ్నలు అడిగాడు.
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను సజావుగా నిర్వహించేందుకు సౌరవ్ గంగూలీ శ్రమిస్తున్నాడు. కరోనా తీవ్రత తగ్గడంతో 25 శాతం మందిని స్టేడియాల్లోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. పాలక మండలితో కలిసి చకచకా నిర్ణయాలు అమలు చేస్తున్నాడు.
మార్చి 26న వాంఖడేలో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో (CSK vs KKR) ఐపీఎల్ ఆరంభం అవుతోంది. అభిమానులను స్టేడియాల్లోకి అనుమతిస్తుండటంతో ఐపీఎల్ 15వ సీజన్లో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. క్రికెట్ అభిమానులు ఇప్పట్నుంచి హోరాహోరీ పోరాటాలను, తమకిష్టమైన ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మార్చి 23 మధ్యాహ్నం నుంచి www.iplt20.comలో టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ముంబయి, నవీ ముంబయి, పుణెలో కొవిడ్ నిబంధనలను అనుసరించి 25 శాతం మందిని అనుమతిస్తున్నాం. వాంఖడే, డీవై పాటిల్‌లో 20, బ్రబౌర్న్, ఎంసీఏలో 15 చొప్పున మ్యాచులు జరుగుతాయి' అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.
ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. మార్చి 26వ తేదీన వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.
మార్చి 27వ తేదీన టోర్నీలో మొదటి డబుల్ హెడర్ జరగనుంది. ఆరోజు సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. రాత్రి జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. మార్చి 29వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.