Ravichandran Ashwin on Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ మళ్లీ నాయకత్వం వహించడం గురించి రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బహుశా వచ్చే ఏడాది అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని అంచనా వేశాడు. తన యూట్యూబ్ ఛానళ్లో ఆర్‌సీబీ జట్టు గురించి మాట్లాడాడు. ఈ సీజన్లో యాష్ రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
'కొన్నేళ్లు విరాట్ కోహ్లీపై నాయకత్వ భారం విపరీతంగా ఉందనిపిస్తోంది. అది అతడికి స్ట్రెస్‌గా మారింది. ఈ ఏడాది అతడికి కాస్త విరామం ఇచ్చారు. బహుశా వచ్చే సీజన్లో కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక చేయొచ్చని నా అంచనా' అని అశ్విన్ అన్నాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంతో ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ నాయకుడిగా నియమించింది. ఇప్పటికే అతడు కెరీర్ చరమాంకంలో ఉండటంతో ఎక్కువ కాలం నాయకత్వం వహించకపోవచ్చని యాష్ అంటున్నాడు.
'డుప్లెసిస్ దాదాపుగా ఐపీఎల్ కెరీర్ ఎండింగ్‌లో ఉన్నాడు. బహుశా అతడు రెండుమూడేళ్లు ఆడుతుండొచ్చు. అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. అతడు ఎక్కువ అనుభవాన్ని తీసుకొస్తాడు. అతడి కెప్టెన్సీ నైపుణ్యాల్లో కాస్త ఎంఎస్ ధోనీ లక్షణాలు కనిపిస్తుండొచ్చు' అని అశ్విన్ చెప్పాడు. ఆర్‌సీబీ తుది జట్టులో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, డుప్లెసిస్, మహిపాల్ లోమ్రర్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ / ఫాబియన్ అలన్, హర్షల్ పటేల్, హసరంగ, మహ్మద్ సిరాజ్, జేసన్ బెరెన్‌డార్ఫ్ ఉండొచ్చని అంచనా వేశాడు.
అంతకు ముందు 'డుప్లెసిస్ చేరికతో బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసలైన బలం పెరిగింది. అతనిప్పటికే నిరూపించుకున్నాడు. ప్రతి సీజన్లో రాణిస్తాడు. అత్యుత్తమ, అత్యున్నత స్థాయిల్లో క్రికెట్ ఆడాడు' అని సంజయ్ బంగర్ అన్నాడు. 'మా టాప్ ఆర్డర్‌ను మరింత దృఢంగా మార్చే క్రికెటర్ల కోసం చూస్తున్నాం. డుప్లెసిస్ చేరికతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. అతడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు ఆడాడు. అతడి ఓపెనింగ్ మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలు ఆర్‌సీబీకి ఎంతో ముఖ్యం' అని ఆర్‌సీబీ కోచ్ బంగర్ వెల్లడించాడు.