IPL 2022, SRH update: ఇండియన్ ప్రీమియర్ లీగు (IPL 2022)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచులు గెలిచింది. కానీ అప్పుడే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది! స్పిన్ స్పెషలిస్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయపడ్డాడు. 2-3 మ్యాచుల వరకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022లో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడింది. ఈ మ్యాచ్ ఆడుతుండగానే వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అతడు బౌలింగ్ చేసే చేతిలో బొటన వేలు, చూపుడు వేలి మధ్య చిన్న చీలిక వచ్చిందని హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ (Tom Moody) అన్నారు. రాజస్థాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచులో సుందర్ వికెట్టేమీ తీయకుండా 47 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత పుంజుకొని మిగతా మ్యాచుల్లో 11 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనై సుందర్ పూర్తి కోటా బౌలింగ్ చేయలేదు. మూడు ఓవర్లు వేశాడు. అందులో రెండు పవర్‌ప్లేలో వేసి 14 పరుగులే ఇచ్చాడు. 'వాషింగ్టన్ కుడి చేతికి గాయమైంది. అతడిని 3-4 రోజులు పర్యవేక్షించాల్సి ఉంది. ఇప్పటికైతే పెద్ద దెబ్బ కాదనే అనుకుంటున్నాం. బహుశా అతడు కోలుకోవడానికి ఒక వారం పట్టొచ్చు' అని టామ్ మూడీ అన్నాడు. అంటే కనీసం రెండు మ్యాచులకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు.
వాషింగ్టన్ స్థానంలో శ్రేయస్ గోపాల్ (Shreyas Gopal), జే సుచిత్‌ను ఎంపిక చేసుకోవచ్చే లేదా అబ్దుల్ సమద్, అయిడెన్ మార్క్‌క్రమ్ సేవలు ఉపయోగించు కోవచ్చు. గుజరాత్‌పై ఛేదనలో తిమ్మిర్లు రావడంతో మధ్యలోనే వచ్చేసిన రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) బాగానే ఉన్నాడని ఫ్రాంచైజీ తెలిపింది.
గుజరాత్‌పై సన్‌రైజర్స్ ఛేదన ఎలా సాగిందంటే?
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క ఓటమి కూడా చవి చూడని గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఎక్కడా తడబడకుండా...
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏమాత్రం తడబడకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (42: 32 బంతుల్లో, ఆరు ఫోర్లు), కేన్ విలియమ్సన్ (57: 46 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ అవుట్ కావడంతో రాహుల్ త్రిపాఠితో (17 రిటైర్డ్ హర్ట్: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి కేన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రాహుల్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ పూర్తయింది. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో విలియమ్సన్ అవుట్ అయినా... నికోలస్ పూరన్ (34 నాటౌట్: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (12 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్) మ్యాచ్‌ను ముగించారు.