SRH vs GT, Match Highlights: గుజరాత్‌కు మొదటి ఓటమి - రైజర్స్‌కు రెండో విజయం - అదరగొట్టిన కేన్, పూరన్

IPL 2022, SRH vs GT: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Continues below advertisement

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క ఓటమి కూడా చవి చూడని గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Continues below advertisement

కట్టడి చేసిన సన్‌రైజర్స్ బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌కు మొదట్లోనే బ్రేకులు పడ్డాయి. ఫాంలో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను (7: 9 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే భువీ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్ వికెట్‌ను (11: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) నటరాజన్ తీసుకోవడం గుజరాత్ పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ వేడ్ (19: 19 బంతుల్లో, మూడు ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (12: 15 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోవడంతో 104 పరుగులకే గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో గుజరాత్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్యా (50 నాటౌట్: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), అభినవ్ మనోహర్ (35: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకున్నారు. అభినవ్ మనోహర్ క్యాచ్‌ను సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఏకంగా మూడు సార్లు వదిలేయడం తనకు బాగా కలిసొచ్చింది. చివర్లో మనోహర్ అవుట్ కావడం... హార్దిక్ వేగంగా ఆడలేకపోవడంతో గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 162 పరుగులకే పరిమితం అయింది.

ఎక్కడా తడబడకుండా...
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏమాత్రం తడబడకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (42: 32 బంతుల్లో, ఆరు ఫోర్లు), కేన్ విలియమ్సన్ (57: 46 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ అవుట్ కావడంతో రాహుల్ త్రిపాఠితో (17 రిటైర్డ్ హర్ట్: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి కేన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రాహుల్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ పూర్తయింది. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో విలియమ్సన్ అవుట్ అయినా... నికోలస్ పూరన్ (34 నాటౌట్: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (12 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్) మ్యాచ్‌ను ముగించారు.

Continues below advertisement