ఐపీఎల్ 2022లో 22వ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు చెన్నై వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. మరోవైపు వరుస విజయాలతో బెంగళూరు దుమ్మురేపుతోంది. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం? తుది జట్టులో ఎవరుంటారు? గెలిచేదెవరు?
డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్ (CSK)కు ఈ సారి తిరుగులేదనుకున్నారు. కానీ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పూర్తిగా విఫలమవుతున్నాడు. మధ్య ఓవర్లలో పరుగులు ఎక్కువగా చేయడం లేదు. ఒకరిద్దరు ఆటగాళ్లు ఔటైతే ఒత్తిడికి లోనవుతున్నారు. బౌలింగ్ లోనూ అంతే! దీపక్ చాహర్ (Deepak Chahar) లోటు బాగా తెలుస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్ ఓడిపోయిన ఆర్‌సీబీ (RCB) ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి హ్యాట్రిక్ అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ము రేపుతోంది. ఆటగాళ్లు కసిగా ఆడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నై, బెంగళూరు (CSK vs RCB) మ్యాచులంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ఎంఎస్ ధోనీ (MD Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎదురెదురుగా తలపడేవారు. ఈ రెండు జట్లలో సీఎస్‌కేదే పైచేయి. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు 28 సార్లు తలపడితే 18సార్లు ధోనీసేనే గెలిచింది. కేవలం 9 సార్లు మాత్రమే బెంగళూరును విజయం వరించింది. చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ చెన్నై 3-2తో ఆధిక్యంలో ఉంది. మానసికంగా సీఎస్‌కేదే ఆధిపత్యం అయినా ఈ సారి జోష్ మాత్రం బెంగళూరులో ఉంది.
CSK vs RCB Probable XI
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, ముకేశ్ చౌదరీ/ తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, అకాశ్ దీప్