IPL 2022 Virat Kohli poor form continues in Powerplay this IPL : ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. పుణె వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో రెండో మ్యాచులోనూ విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చినప్పటికీ స్కోరు చేయలేకపోయాడు. అభిమానులను నిరాశపరిచాడు. వికెట్‌ పడగానే ఏం చేయాలో అర్థంకాక నిర్వేదంలో నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.


ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ అర్ధశతకాలు చేయలేదు. రెండు మూడు సార్లు డకౌట్‌ అయ్యాడు. అతడిని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఓపెనర్‌గా పంపించింది. ఎక్కువ సమయం దొరికితే నిలదొక్కుకుంటాడని భావించింది. అందుకు తగ్గట్టే ఈ మ్యాచులో ఆర్సీబీ ముందు తక్కువ టార్గెట్టే ఉంది. 145 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. దాంతో విరాట్‌ నిలుస్తాడని అభిమానులు ఆశించారు.


అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరాట్‌ 10 బంతులాడి 9 పరుగులకే ఔటయ్యాడు. 2 బౌండరీలు కొట్టాడు. అప్పటికే ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో రెండుసార్లు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ రెండో ఓవర్లో ప్రసిద్ధ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వరుసగా 3 బంతులు డాట్‌ అవ్వడంతో ఎలాగైనా పరుగులు చేయాలని కోహ్లీ అనుకున్నాడు. షార్ట్‌పిచ్‌లో వేసిన బంతి తలమీదుగా వెళ్తుంటే బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడబోయాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్‌ పరాగ్‌ అమేజింగ్‌ డైవ్‌తో క్యాచ్‌ అందుకున్నాడు.


ఈ సీజన్లో విరాట్‌ కోహ్లీ పవర్‌ప్లేలో 6 ఇన్నింగ్సుల్లో 5 సార్లు ఔటయ్యాడు. కేవలం 6.80 సగటు, 100 స్ట్రైక్‌రేట్‌తో 34 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2022లో 9 మ్యాచులాడి 16 సగటు 119 స్ట్రైక్‌రేట్‌తో 128 పరుగులు చేశాడు. 11 బౌండరీలు, 2 సిక్సర్లు కొట్టాడు. అయితే ఓపెనర్‌గా విరాట్‌ది మెరుగైన రికార్డే. ఈ మ్యాచుకు ముందు 76 ఇన్నింగ్సుల్లో అతడు ఓపెనింగ్‌ చేశాడు. 13 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.  18 హాఫ్‌ సెంచరీలు, 5 సెంచరీల సాయంతో 2750 పరుగులు చేశాడు.  సగటు 43.65 కాగా స్ట్రైక్‌రేట్‌ 136.68. మిగతా అన్ని పొజిషన్ల కన్నా అతడికి ఇవే అత్యుత్తమ గణాంకాలు. వన్‌డౌన్‌లో 93 ఇన్నింగ్సులు ఆడిన విరాట్‌ 35 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 2815 పరుగులు చేశాడు.