ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వైఫల్యాల పరంపర ఆగడం లేదు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా తను కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. అయినా ఈ మ్యాచ్‌లో ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఐపీఎల్‌లో 6,500 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న మొదటి ఆటగాడు కోహ్లీనే.
ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ (6,186 పరుగులు), డేవిడ్ వార్నర్ (5,876 పరుగులు), రోహిత్ శర్మ (5,829 పరుగులు), సురేష్ రైనా (5,528 పరుగులు), ఏబీ డివిలియర్స్ (5,162 పరుగులు) ఉన్నారు. డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలకు ఈ సీజన్‌లోనే ఆరు వేల పరుగుల మార్కును అందుకునే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లియాం లివింగ్‌స్టోన్ (70: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... జానీ బెయిర్‌స్టో (66: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) ఇన్నింగ్స్ ప్రారంభంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (20: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు), మహిపాల్ లొమ్రోర్ (6: 3 బంతుల్లో, ఒక సిక్సర్) అవుటయ్యారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్ క్రీజులో ఉన్నారు.