IPL 2022 Viewership: ఐపీఎల్‌ 2022 విజేతగా ఓ కొత్త జట్టు ఆవిర్భవించింది. గుజరాత్‌ టైటాన్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు టీవీ రేటింగ్స్‌ దారుణంగా పడిపోయాయి. 15 ఏళ్ల లీగు చరిత్రలోనే అతి తక్కువ రేటింగ్స్‌ వచ్చాయి. లీగ్‌ దశతో పోలిస్తే ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ రేటింగ్స్‌ ఇంకా తగ్గాయి. ఫలితంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ వారంలోనూ స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ ఛానెల్‌ ఐదో స్థానానికి తగ్గింది.


తాజాగా బార్క్‌ 21వ వారం రేటింగ్స్‌ను ఇచ్చింది. 2022 మే 21 నుంచి 27 మధ్య కాలానికి వీటిని ఇచ్చారు. ఈ రేటింగ్స్‌ ప్రకారం స్టార్‌ స్పోర్ట్స్‌ హిందీ ఛానెల్‌ కేవలం 17,82,000 వీక్లీ ఏఎంఏ సగటు నమోదు చేసింది. లీగ్‌ దశతో పోలిస్తే 10-12 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇదే సమయంలో సన్‌టీవీ 25,53,000 వీక్లీ ఏఎంఏ నమోదు చేసింది. ఇక స్టార్‌ మా, స్టార్‌ ప్లస్‌ సైతం స్టార్‌ స్పోర్ట్స్‌ కన్నా ఎక్కువ రేటింగే నమోదు చేశాయి. ఐపీఎల్‌ 2021లో స్టార్‌స్పోర్ట్స్‌ 1 హిందీ ఛానెల్‌ 27,32,000 వీక్లీ ఏఎంఏ సగటు నమోదు చేయగా ఐపీఎల్‌ 2022 వీక్లీ ఏఎంఏ సగటు 17,82,000 కావడం గమనార్హం.


ఐపీఎల్‌ 2022లో తొలి క్వాలిఫయర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగింది. ఇందులో టైటాన్స్‌ గెలిచింది. ఎలిమినేటర్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడింది. లక్నో త్రుటిలో ఓటమి పాలైంది. రెండో క్వాలిఫయర్లో ఆర్సీబీని రాజస్థాన్‌ చిత్తుగా ఓడించింది. ఫైనల్లో రాజస్థాన్‌ను టైటాన్స్‌ ఓడించి విజేతగా ఆవిర్భవించింది. సాధారణంగా ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచులను అభిమానులు విపరీతంగా చూస్తారు. అలాంటిది ఈ సారి రేటింగ్స్‌ పడిపోవడం ప్రకటనదారులను ఆందోళనకు గురి చేసింది.


ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ పడిపోవడంతో తమ నష్టానికి పరిహారం చెల్లించాలని ప్రకటనకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 'చూడండి, మేం 15 శాతం వరకు ఎక్కువ డబ్బు చెల్లించాం. కానీ నంబర్లు మాత్రం 28-30 శాతం వరకు తగ్గాయి. ఇది మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే ఎంతో కొంత పరిహారం చెల్లించి సమస్యను పరిష్కరించాలని స్టార్‌స్పోర్ట్స్‌ను సంప్రదించాం' అని ఒక అడ్వర్టైజర్‌ చెప్పాడని ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ రిపోర్టు చేసింది. మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ సైతం రేటింగ్స్‌ పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.


'ఈ సీజన్లోని తొలి 25 మ్యాచుల టీవీ రేటింగ్స్‌ ఒకసారి పరిశీలించండి. 22-40 ఏళ్ల వయస్కుల వీక్షణ 58 శాతం తగ్గిపోయింది. 30-35 శాతం పడిపోయిన 30-35 శాతం సగటు వ్యూయర్‌షిప్‌ కన్నా ఇదెంతో ఎక్కువ. అందుకే మేం అదనపు ఫ్రీ కమర్షియల్‌ టైమ్‌ గురించి స్టార్‌స్పోర్ట్స్‌తో చర్చిస్తున్నాం. అప్పుడే మా లక్ష్యాలు నెరవేరుతాయి' అని శశాంక్‌ అంటున్నారు. అయితే భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 సిరీసులో వీరికి న్యాయం చేస్తారని తెలిసింది.