Gautam Gambhir reveals Selfless Act says no shame working in IPL because I feed 5000 people – Watch video : ప్రతి నెలా తాను 5000 మందికి అన్నం పెడుతున్నానని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అంటున్నాడు. వారి కడుపు నింపేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. కామెంటరీ చేయడం, మెటార్‌గా పనిచేసేందుకు సిగ్గుపడనని వెల్లడించాడు. ఐపీఎల్‌లో పనిచేయడంపై అతడు మాట్లాడిన వీడియో తాజాగా వైరల్ అయింది.
ఈ మధ్యే గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. సమాజానికి తాను చేస్తున్న సేవల గురించి వివరించాడు. 5000 మందికి అన్నం పెట్టే బాధ్యతను తాను తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇందుకు ప్రతి నెలా రూ.25 లక్షలు ఏటా రూ.2.75 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించాడు. అందుకే ఐపీఎల్‌లో కామెంటరీ, ఇతర పనులు చేసి నిజాయతీగా సంపాదిస్తున్నానని స్పష్టం చేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బే ఉపయోగిస్తున్నాను కాబట్టి తానేమీ సిగ్గుపడటం లేదన్నాడు.
'నేను ఐపీఎల్‌లో పనిచేస్తాను. ఎందుకంటే 5000 మంది కడుపు నింపేందుకు ఏటా రూ.2.75 కోట్లు ఖర్చు చేయాలి. ఈ డబ్బంతా నా జేబులోంచే ఇస్తాను. అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తానని చెప్పేందుకు సిగ్గుపడను. నా అత్యున్నత లక్ష్యాల కోసమే ఇదంతా చేస్తాను. ఉచిత భోజనశాలలు, గ్రంథాలయాలు, స్మాగ్ టవర్లు నిర్మించేందుకు నిజాయతీగా సంపాదించిన డబ్బు ఖర్చు చేయడం తప్పైతే నేను మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేస్తాను' అని వివరించాడు.
టీమ్‌ఇండియా క్రికెటర్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన దృక్పథానికి అనుకూలంగా ఉన్న బీజేపీలో చేరాడు. లోక్‌సభకు ఎన్నికయ్యాడు. సైన్యం, పేదవారికి ఇబ్బంది కలిగితే ఊరుకోడు. తనకు తోచిన సాయం చేసేందుకు ముందుకొస్తాడు. రెండేళ్ల క్రితం జమ్ము కశ్మీర్‌లో జవాన్లు ప్రమాదానికి గురైతే వారి కుటుంబాల బాధ్యతను తీసుకున్నాడు. వారి పిల్లలను చదివిస్తూ అన్నం పెడుతున్నాడు. కరోనా సమయంలోనూ ఆరోగ్య కిట్లు, నిత్యావసర సరుకులు, ఔషధాలను ఉచితంగా పంచాడు. తాజాగా అతడు లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా సేవలు అందించాడు.