TDP Leader Murder Update : పల్నాడు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబీకులకు ఎక్కడకు తీసుకెళ్తున్నామని చెప్పకుండానే మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించారు. అయితే అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించలేదు. జల్లయ్య సహకరిస్తే వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు తమపైనా దాడులు చేస్తారేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా రావులాపురం తరలించడంతో మృతదేహం అప్పగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా.. తీసుకునేందుకు బంధువులు నిరాకరిస్తున్నారు. కుటుంబసభ్యులు లేకుండా మృతదేహం ఎలా తీసుకుంటామని బంధువులు చెబుతున్నారు.
పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహాన్ని.. ఆస్పత్రి నుంచి ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిలదీశారు. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.మరోవైపు జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడలేని పోలీసులు.. అంత్యక్రియలకు వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ నేత నారా లోకేష్ కూడా జల్లయ్య కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు.
టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల కారణంగా పెద్ద ఎత్తున పోలీసుల బలగాలను మోహరించారు.