India Tour of England:  బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly), జే షా (Jay Shah) ఇంగ్లాండ్‌కు వెళ్తున్నారు. బర్మింగ్‌హామ్‌లో టీమ్‌ఇండియా ఐదో టెస్టును ప్రత్యక్షంగా వీక్షిస్తారని తెలిసింది. అదే సమయంలో ఐపీఎల్‌ విండో సమయం పెంపు, మహిళల ఐపీఎల్‌ విండో గురించి ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ తో చర్చించబోతున్నారని సమాచారం.


'అవును, ఇప్పటికే సమావేశ ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు ఇంగ్లాండ్‌ వెళ్తున్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగే ఐదో టెస్టు మ్యాచును వీక్షించనున్నారు. టెస్టు మ్యాచుకు ఒక రోజు ముందు జూన్‌ 30న ఇంగ్లాండ్‌కు చేరుకుంటారు' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.


'ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీతో ఐపీఎల్‌ లాంగర్‌ విండో గురించి మాట్లాడతారు. అయితే ఈ ఒక్క అంశంపైనే సమావేశం అవ్వడం లేదు. ఇంకా చాలా అంశాలు చర్చిస్తారు. బీసీసీఐకి ఈసీబీ చాలా మద్దతు ఇస్తోంది. ప్రత్యేకించి మహిళల ఐపీఎల్‌, ఐపీఎల్‌కు అండగా ఉంటోంది' అని ఆ అధికారి వెల్లడించారు. 


గతంలో ఎనిమిది జట్లతో ఉన్న ఐపీఎల్‌ పదికి పెరిగింది. 2022 సీజన్‌ సూపర్‌ హిట్టైంది. గుజరాత్‌ టైటాన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. అయితే ఐపీఎల్‌ కోసం లాంగర్‌ విండో కావాలని బీసీసీఐ అనుకుంటోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి మహిళలకు కచ్చితంగా లీగ్‌ నిర్వహించనుంది. ఇందుకోసం సెప్టెంబర్‌-అక్టోబర్‌ విండోను ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అన్ని దేశాల బోర్డులతో మాట్లాడుతోంది.


గతేడాది ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. నాలుగు టెస్టులు ముగిసే సరికే 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా వైరస్ వెంటాడటం వల్ల ఆఖరి టెస్టును వాయిదా వేశారు. ఆ మ్యాచ్‌ జులై 1-5 మధ్య జరగనుంది. 15 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ను సొంత దేశంలో ఓడించే అవకాశం టీమ్‌ఇండియా ముంగిట నిలిచింది. ఈ మ్యాచును డ్రా చేసుకున్నా చాలు. ఈ అరుదైన ఘనతను ప్రత్యక్షంగా వీక్షించాలని బీసీసీఐ పాలక త్రయం భావిస్తోంది.


టెస్టు జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి, చెతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ