IPL 2022 rr vs rcb qualifier 2 Match up Wanindu Hasaranga with Sanju Samson once again : ఐపీఎల్ 2022 క్వాలిఫయర్ 2లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరా ఇందుకు వేదిక. ఈ మ్యాచులో గెలిచిన వారే ట్రోఫీ బరిలో నిలుస్తారు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటారు.
ఈ నాకౌట్ మ్యాచులో ప్రతి ఆటగాడు రాణించడం ఆయా జట్లకు అవసరం. క్వాలిఫయర్ పోరులో కొందరు ఆటగాళ్ల మధ్య మ్యాచప్స్ బాగున్నాయి. సంజు శాంసన్ vs హసరంగ, సిరాజ్ పోరుపై ఆసక్తి నెలకొంది. అలాగే దినేశ్ కార్తీక్ vs యుజ్వేంద్ర చాహల్ పోటీ ఇంట్రెస్టింగా మారనుంది.
రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే కెప్టెన్ సంజు శాంసన్ కచ్చితంగా రాణించాలి. ఆ జట్టు భారీ స్కోరు చేసిందంటే అందులో సంజు పాత్ర ఉంటుంది. ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇస్తే దానికి మరింత వేగాన్ని జోడిస్తాడు. ఓపెనర్లు త్వరగా వికెట్లు పోగొట్టుకుంటే క్రీజులో ఉంటూనే సిక్సర్లు బాదేస్తుంటాడు. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తాడు. ఎలాంటి బౌలర్‌నైనా అలవోకగా ఎదుర్కోవడం సంజూ గొప్పదనం. ఈ సీజన్లో 15 మ్యాచుల్లో 150 స్ట్రైక్‌రేట్, 30 సగటుతో 421 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు బాదేశాడు. 40 బౌండరీలు, 24 సిక్సర్లు కొట్టాడు.
అమేజింగ్ ఇన్నింగ్స్‌తో అలరించే సంజూ శాంసన్‌కు కొన్ని వీక్‌నెస్‌లు ఉన్నాయి. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ హసరంగ బౌలింగ్‌లో ఊరికే ఔటవుతుంటాడు. అతడి బౌలింగ్‌లో ఆరుసార్లు ఆడితే ఐదుసార్లు ఔటయ్యాడు. 23 బంతుల్లో 18 పరుగులే చేశాడు. అతడిపై ఆర్సీబీ కచ్చితంగా హసరంగ ప్రయోగిస్తుంది. అలాగే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనూ సంజూ ఇబ్బంది పడుతున్నాడు. 20 బంతులు ఎదుర్కొని 21 పరుగులే చేసి 2 సార్లు ఔటయ్యాడు.
ఆర్సీబీకీ ఒక ఇబ్బంది ఉంది. విధ్వంసకరంగా షాట్లు ఆడేస్తున్న దినేశ్ కార్తీక్ రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో భయపడుతున్నాడు. 10 ఇన్నింగ్సుల్లో 12.66 సగటుతో ఆడుతున్నాడు. మూడుసార్లు పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఐపీఎల్ తొలి ఎనిమిది మ్యాచుల్లో 7.8 ఎకానమీతో 10 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ ఆ తర్వాత 7 మ్యాచుల్లో 5 వికెట్లే తీశాడు. ఎకానమీ 9కి పెరిగింది.