IPL 2022 rr vs rcb qualifier 2 Royals stand between resurgent RCB and final spot in Ahmedabad : ఐపీఎల్‌ 2022లో ఆఖరి రెండో గేమ్‌కు వేళైంది! క్వాలిఫయర్‌ 2కి రాజస్థాన్‌ రాయల్స్‌ (RR), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం మోతేరా ఇందుకు వేదిక. మరి వీరిలో ఎవరిది పైచేయి? ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారు? నాకౌట్‌ అయ్యేది ఎవరు?


నువ్వా నేనా అన్నట్టే!


క్వాలిఫయర్‌ 2కు ముందు ఐపీఎల్‌ 2022లో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. దిల్లీని ముంబయి ఓడించడంతో ఆర్సీబీ ఎలిమినేటర్‌కు ఎంపికైంది. మరోవైపు చెన్నైపై గెలవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ రన్‌రేట్‌ పెరిగింది. లక్నోను వెనక్కి నెట్టి క్వాలిఫయర్‌ 1కు చేరుకుంది. ఆ మ్యాచులో ఓడిన రాజస్థాన్‌ పట్టుదలతో ఉంది. ఎలిమినేటర్లో గెలిచిన బెంగళూరు జోష్‌లో ఉంది. అందుకే ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. ఈ రెండు జట్లు లీగ్‌ దశలో రెండు సార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్‌ గెలిచాయి.


బౌలింగ్ లెంగ్తులు కరెక్ట్‌ చేసుకోవాలి


గతంతో పోలిస్తే రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి పటిష్ఠంగా కనిపించింది. జట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి. కెప్టెన్‌ సంజు శాంసన్‌ నాయకత్వం బాగుంది. కూల్‌గా ఉంటూనే కష్టాలను ఎదుర్కొన్నాడు. దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌ నిలకడగా రన్స్‌ చేస్తున్నారు. జోస్‌ బట్లర్‌ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. అప్పుడప్పుడు మిడిలార్డ్‌ ఇబ్బంది పడుతోంది. బౌలింగ్‌ పరంగా రాయల్స్‌కు తిరుగులేదు. అయితే ఈడెన్‌లో ప్రసిద్ధ్‌, మెకాయ్‌, అశ్విన్‌ సరైన లెంగ్తుల్లో వేయలేకపోయారు. క్వాలిఫయర్‌ 2 జరిగే నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్స్‌కు మంచి అనుభవం ఉంది. కొన్నాళ్లు హోమ్‌గ్రౌండ్‌గా వాడుకుంది. ఇక్కడ 12 ఆడితే 7 గెలిచారు. బహుశా మెకాయ్‌ బదులు ఈసారి జిమ్మీ నీషమ్‌ను తీసుకోవచ్చు.


బెంగళూరు ఫుల్‌ జోష్‌!


ఎలిమినేటర్‌ గెలిచిన బెంగళూరు జోష్‌లో ఉంది. ఒకప్పట్లా ఆ జట్టు ఒకరిద్దరి మీదే ఆధారపడటం లేదు. కొత్త కుర్రాళ్లు మెరుస్తున్నారు. ఎలిమినేటర్లో సెంచరీ కొట్టిన రజత్‌ పాటిదార్‌ హీరోగా మారాడు. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ అతడికి అండగా నిలవడం, బౌండరీలు బాదడం మేలు చేసింది. క్వాలిఫయర్‌2లో గెలవాలంటే మాత్రం కోహ్లీ, డుప్లెసిస్‌ కచ్చితంగా రాణించాలి. బౌలింగ్‌ పరంగా ఆర్సీబీ చాలా బాగుంది. హసరంగ, షాబాజ్‌, మాక్సీ రూపంలో స్పిన్నర్లు ఉన్నారు. జోష్‌ హేజిల్‌వుడ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. హర్షల్‌ పటేల్‌ డెత్‌లో భీకరంగా మారుతున్నాడు. ఫీల్డింగ్‌ మెరుగైంది. సంజు శాంసన్‌పై హసరంగ, సిరాజ్‌కు మెరుగైన రికార్డ్‌ ఉంది.


RR vs RCB Probable XI


రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌, సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, మెకాయ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, దినేశ్‌ కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్‌ సిరాజ్