GT vs RCB, 1 Innings Highlights: ఐపీఎల్‌ 2022లో 43వ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రాణించింది. గుజరాత్‌ టైటాన్స్‌కు 171 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6) మళ్లీ ఫామ్‌ కనబరిచాడు. 14 ఐపీఎల్‌ మ్యాచుల తర్వాత హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా రజత్‌ పాటిదార్‌ (52; 32 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆఖర్లో మాక్సీ (33; 18 బంతుల్లో 3x4, 2x6) , మహిపాల్‌ లోమ్రర్‌ (16; 8 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించారు. టైటాన్స్‌లో ప్రదీప్‌ సంగ్వాన్‌ 2 వికెట్లు తీశాడు.


మధ్యాహ్నం మ్యాచ్‌ కావడం, టార్గెట్లను డిఫెండ్‌ చేస్తుండటంతో టాస్‌ గెలిచిన డుప్లెసిస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఎప్పట్లాగే కోరుకున్న ఆరంభం మాత్రం వారికి దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్ద ప్రదీప్‌ సంగ్వాన్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌ (0) డకౌట్‌ అయ్యాడు. గుజరాత్‌ చక్కగా బౌలింగ్‌ చేస్తుండటంతో విరాట్‌ కోహ్లీ, రజత్ పాటిదార్‌ ఆచితూచి ఆడారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీసి చక్కని భాగస్వామ్యానికి పునాది వేశారు.


వికెట్‌పై నిలదొక్కుకోగానే పాటిదార్‌ బౌండరీలు, సిక్సర్లు బాదటం మొదలు పెట్టాడు. మరోవైపు విరాట్‌ రిస్క్‌ తీసుకోకుండా బౌండరీలు కొడుతూ 45 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. మరికాసేపటికే పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ అందుకొన్నాడు. 74 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని పాటిదార్‌ను ఔట్‌ చేయడం ద్వారా సంగ్వాన్‌ విడదీశాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో విరాట్‌ భారీ షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆఖర్లో మాక్సీ, మహిపాల్‌ లోమ్రర్‌ స్కోరును 170/6కు తీసుకెళ్లారు.