Ravi Shastri ipl commentary: బీసీసీఐ రాజ్యాంగంలోని ఓ స్టుపిడ్‌ రూల్‌తో ఐపీఎల్‌తో కొన్నేళ్లు అనుబంధం తెగిపోయిందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల' నిబంధన వల్లే కామెంటరీ చేయలేకపోయానని వెల్లడించాడు. ఇక నుంచి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నాడు.


ఇండియాలో క్రికెట్‌ చూసే ప్రతి అభిమానికీ రవిశాస్త్రి వాయిస్‌లోని బేస్‌ తెలుసు! కొన్నేళ్ల పాటు ఆయన తన కామెంటరీతో అలరించారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభమైన 2008 నుంచి వరుసగా 11 ఏళ్లు కామెంటరీ ప్యానెల్‌లో కీలకంగా ఉండేవాడు. తనదైన శైలిలో పంచులతో అలరించేవాడు. క్రికెట్ వీక్షకుల్లో ఎంతోమంది ఆయన మాట్లాడే ఇంగ్లిష్‌కే ఫ్యాన్స్‌ అయ్యేవారు.


టీమ్‌ఇండియా కోచ్‌గా ఎంపికైన తర్వాత రవిశాస్త్రి ఐపీఎల్‌ కామెంటరీకి దూరమయ్యారు. ఇందుకు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనే కారణమని తాజాగా అన్నారు. 'ఇది ఐపీఎల్‌ 15వ సీజన్‌. వరుసగా 11 ఏళ్లు నేను కామెంటరీ చేశాను. కానీ బీసీసీఐ రాజ్యాంగంలోని పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్‌ (Conflict of interest clause) మా అనుబంధాన్ని విడదీసింది. దాంతో కొన్ని సీజన్లకు అందుబాటులో లేకుండా పోయాను' అని రవిశాస్త్రి అన్నాడు.


ఎప్పుడూ ఇంగ్లిష్‌ కామెంటరీతో అలరించే రవిశాస్త్రి తొలిసారిగా హిందీలో కామెంటరీ చేయబోతున్నారని తెలిసింది. హిందీ భాషపై తన పట్టు తెలుసుకొనేందుకు ఇప్పటికే రిహార్సల్స్‌ చేశారని సమాచారం. గతేడాది వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన సురేశ్ రైనాను ఈ సీజన్లో ఎవరూ కొనుగోలు చేయలేదు. దాంతో 'మిస్టర్‌ ఐపీఎల్‌' కామెంటరీ ప్యానెల్‌లో చేరాడు. దీనిపై శాస్త్రి స్పందించాడు.


'సురేశ్ రైనాను మీరు మిస్టర్‌ ఐపీఎల్‌ అంటారు. నేను మాత్రం అంగీకరించను. అతడు ఐపీఎల్‌నే పైకి తీసుకొచ్చాడు. ఒక్క మ్యాచ్‌ కూడా మిస్సవకుండా వరుసగా అన్ని సీజన్లు ఆడాడు. అదెంతో పెద్ద కాంప్లిమెంట్‌. లీగులోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ అతడు' అని శాస్త్రి అన్నాడు. ఈ ఐపీఎల్‌ వల్ల భారత భవిష్యత్తు కెప్టెన్‌ తెలిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాడు. 'విరాట్‌ ఇప్పుడు కెప్టెన్‌ కాదు. రోహిత్‌ శర్మకు తెలుపు బంతి క్రికెట్లో తిరుగులేదు. ఇక భవిష్యత్తు గురించి మాట్లాడితే శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ పోటీలో ఉన్నారు' అని ఆయన అభిప్రాయపడ్డారు.