IPL 2022 KL Rahul: శూన్యం నుంచి ఒక కొత్త జట్టును నిర్మించడం నేర్చుకొనేందుకే పంజాబ్‌ కింగ్స్‌ను (Punjab Kings) వదిలేశానని లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Gaints) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అంటున్నాడు. వేలానికి ముందు కోచింగ్‌ స్టాఫ్‌తో కూర్చోవడం, ఆటగాళ్లను ఎంపిక చేయడం వంటివి నేర్చుకున్నానని పేర్కొన్నాడు. పనిలో పనిగా లక్నో వారి సరికొత్త జెర్సీని విడుదల చేసింది.


గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. భారీగా స్కోరు చేశాడు. వేలానికి ముందు అతడిని రీటెయిన్‌ చేసుకోవడానికి పంజాబ్‌ మొగ్గు చూపించింది. రూ.16 కోట్లు చెల్లిస్తామని చెప్పింది. అయినప్పటికీ అతడు జట్టును వీడాడు. రూ.17 కోట్లతో లక్నో తరఫున ఒప్పందం కుదుర్చుకున్నాడు.


'లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున దొరికిన కొద్ది సమయంలోనే నాకో కొత్త అనుభవం దొరికింది. ఎందుకంటే ఒక్కో ఆటగాడి గురించి, ఎంపిక చేయడంపై నేనెప్పుడూ కోచింగ్‌ స్టాఫ్‌తో కూర్చోలేదు. ఒక కొత్త జట్టును రూపొందించడం గతంలో తెలియదు. కోర్‌ టీమ్‌ను ఎలా బిల్డ్‌ చేయాలో అనుభవం లేదు. నిజానికి ఐపీఎల్‌ వేలం ముంగిట ఏం జరుగుతుందో తెలియదు. రీటెన్షన్‌ నుంచి వేలం మధ్యన ఎంతో జరుగుతుంది. అవన్నీ నాకు కొత్త విషయాలే' అని రాహుల్‌ అన్నాడు.


ఏమీ లేని దగ్గర్నుంచి ఒక కొత్త జట్టును నిర్మించడం ఎలాగో తెలుసుకొనేందుకే పంజాబ్‌ కింగ్స్‌ను వీడానని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. 'ఈ అనుభవం ఎంతో సరదాగా ఉంది. ఇలాంటి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త జట్టును నిర్మించడం తెలిసింది. ఒక కొత్త ఫ్రాంచైజీలో భాగమవ్వడం అనుభవమైంది. ఈ చర్యలన్నీ నన్ను ఎక్సైట్‌మెంట్‌కు గురి చేశాయి. అందుకే నేను కొత్త జట్టుకు వచ్చాను. నేర్చుకొనేందుకు అవకాశం దొరికింది. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఇది నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో చూసేందుకు ఆసక్తిగా ఉంది' అని కేఎల్‌ చెప్పాడు. లక్నో రిలీజ్ చేసిన కొత్త జెర్సీకి స్పందన బాగుంది.