IPL 2022 set to welcome fans back to the stadiums: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! ఐపీఎల్ 2022 మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం వచ్చింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత అభిమానులను బీసీసీఐ (BCCI) స్టేడియాల్లోకి అనుమతిస్తోంది. కొవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుసరించి 25 శాతం మందికి టికెట్లు విక్రయించనుంది.
ఇండియాలో ఐపీఎల్ (IPL 2022) అంటే ఎంతో మజా ఉంటుంది! స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. గ్యాలరీలో ఒక్క సీటైనా ఖాళీగా ఉండేది కాదు. ఫ్యాన్స్ వేసే ఈలలతో స్టేడియాలు మార్మోగిపోయేవి. ఆ జోష్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లు సిక్సర్ల జడివాన కురిపించేవారు.
దేశంలో కరోనా (covid 19) ఎంటరవ్వడంతో ఐపీఎల్‌కు గడ్డుకాలం మొదలైంది. 2020లో సీజన్ ఆలస్యంగా ఆరంభమైంది. సెప్టెంబర్లో యూఏఈలో నిర్వహించారు. దానికి అభిమానులను అనుమతించలేదు. ఈలలు, గోలలు లేకుండా టీవీల్లో కృతిమ కోలాహలం సృష్టించి టీవీల్లో ప్రసారం చేశారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఫ్యాన్స్‌ను అనుమతించినా మళ్లీ కొవిడ్ విజృంభించడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.
'మార్చి 26న వాంఖడేలో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో (CSK vs KKR) ఐపీఎల్ ఆరంభం అవుతోంది. అభిమానులను స్టేడియాల్లోకి అనుమతిస్తుండటంతో ఐపీఎల్ 15వ సీజన్లో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. క్రికెట్ అభిమానులు ఇప్పట్నుంచి హోరాహోరీ పోరాటాలను, తమకిష్టమైన ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మార్చి 23 మధ్యాహ్నం నుంచి www.iplt20.comలో టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ముంబయి, నవీ ముంబయి, పుణెలో కొవిడ్ నిబంధనలను అనుసరించి 25 శాతం మందిని అనుమతిస్తున్నాం. వాంఖడే, డీవై పాటిల్‌లో 20, బ్రబౌర్న్, ఎంసీఏలో 15 చొప్పున మ్యాచులు జరుగుతాయి' అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.
ఐపీఎల్ 15వ సీజన్లో మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. మార్చి 26వ తేదీన వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.
మార్చి 27వ తేదీన టోర్నీలో మొదటి డబుల్ హెడర్ జరగనుంది. ఆరోజు సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. రాత్రి జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. మార్చి 29వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంల్లో చెరో 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక బ్రబౌర్న్, పుణేలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలు చెరో 15 మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. టోర్నమెంట్‌లో మొత్తంగా 12 డబుల్ హెడ్డర్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ ఫైనల్ మే 29వ తేదీ జరగనుంది. ఈ మ్యాచ్‌కు, ప్లే ఆఫ్స్‌కు ఇంకా వేదికలు ఖరారు కాలేదు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చాక వాటికి సంబంధించిన షెడ్యూలును కూడా ప్రకటిస్తారు.