IPL 2022 Playoffs Scenarios: ఐపీఎల్‌ 2022లో ప్లేఆఫ్స్‌ సినారియో మ్యాచు మ్యాచుకూ మారిపోతోంది! పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లూ నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయో లేదో అనుమానంగా మారింది. మెరుగ్గా ఉన్న జట్లూ కింద స్థాయిలో జట్లతో మ్యాచులు ఆడేందుకు భయపడుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం అందుకోవడంతో సమీకరణాలు తారుమారు అయ్యాయి. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న సంజూ సేన ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే చావో రేవో అన్నట్టుగా పోటీపడాల్సిన స్థితి వచ్చేసింది.


అంతా దిల్లీ చేతుల్లోనే


ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచులాడి 6 గెలిచి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. లీగ్‌ దశలో మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. పంజాబ్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంటుంది. రాజస్థాన్‌పై నెట్‌ రన్‌రేట్ (0.210) మెరుగవ్వడంతో దిల్లీ కాస్త కంఫర్టబుల్‌ సిచ్యువేషన్‌లోకి వెళ్లింది. తర్వాతి రెండు మ్యాచుల్లో దిల్లీ గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. ఇతర జట్లూ 16 పాయింట్లతో ఉంటే మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్స్‌కు ఛాన్స్‌ ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రమే 12 మ్యాచుల్లో 14 పాయింట్లతో దిల్లీ కన్నా ముందుంది. నెట్‌ రన్‌రేట్‌ -0.115 కావడం ఇబ్బందికరం. ఒకవేళ తర్వాతి మ్యాచుల్లో బెంగళూరు గెలవకున్నా, దిల్లీ గెలిచినా పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది.


రాజస్థాన్‌కు డూ ఆర్‌ డై


ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ 12 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్‌ రన్‌రేట్‌ 0.228. తర్వాతి మ్యాచుల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. దిల్లీ చేతిలో ఓటమితో 0.326గా ఉన్న రన్‌రేట్‌ 0.228కి తగ్గిపోయింది. క్యాపిటల్స్‌తో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా ఉంది. అంటే తర్వాత జరిగే రెండు మ్యాచుల్లో ఏ ఒక్కటి ఓడినా సిచ్యువేషన్‌ వెంటిలేటర్‌ మీదకు వెళ్తుంది. ఒకటి గెలిచి 16 పాయింట్లు సాధించినా నాలుగో స్థానంలో ఉండే ఛాన్స్‌ ఉంది. ఇలా జరగాలన్నా ఆర్సీబీ తన తర్వాత రెండు మ్యాచులు గెలిచి 18 పాయింట్లతో ఉండాలి. అప్పుడు దిల్లీ గనక 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆడకుండానే ఇంటికి రావాల్సి ఉంటుంది.


అందుకే ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడాల్సిన మ్యాచ్‌ రాజస్థాన్‌కు డూ ఆర్‌ డైగా మారింది. ఇందులో లక్నో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. ఓడినా మరో ఛాన్స్‌ ఉంటుంది. రాజస్థాన్‌కు మాత్రం అలాంటి కుషన్‌ లేదు. అవతలి వాళ్లు ఓడిపోవాల్సి ఉంటుంది.