IPL 2022 News: ఇండియన్ ప్రీమియర్ లీగు (Indian Premier leauge) సరికొత్త సీజన్ మహారాష్ట్రలో నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. మొత్తం లీగు మ్యాచుల్లో 55 ముంబయిలో, 15 పుణెలో నిర్వహిస్తారని సమాచారం. ఫ్రాంచైజీలన్నీ ఇందుకు సుముఖంగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) మాత్రమే సొంత మైదానం ప్రయోజనం లభిస్తుండటంపై బీసీసీఐని ప్రశ్నిస్తున్నాయి.
ఐపీఎల్ 2022 (IPL auction 2022) వేలం ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్లను ఎంచుకున్నాయి. కొవిడ్ వల్ల గత రెండు సీజన్లను యూఏఈలో నిర్వహించారు. ఈ సారి మాత్రం ఎలాగైనా భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. అయితే ఈసారి మ్యాచులన్నీ ఒకే నగరం లేదా పక్కపక్క నగరాల్లో నిర్వహించాలని అనుకుంటోంది. ముంబయిలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, పుణెలోని ఎంసీజీ మైదానాలను ఎంపిక చేశారు. ముంబయిలో 55, పుణెలో 15 మ్యాచులు జరిగే నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ స్థానికంగా ఉండే వాంఖడేలో కొన్ని మ్యాచులు ఆడాల్సి వస్తుంది. అన్ని ఫ్రాంచైజీలకు సొంత మైదానం ప్రయోజనం లేనప్పుడు దానికి మాత్రం ఉంటే ఎలాగని మిగతా ఫ్రాంచైజీలు ప్రశ్నిస్తున్నాయి.
'లీగులో ఏ జట్టుకూ సొంతమైదానం ప్రయోజనం ఉండటం లేదు. అలాంటప్పుడు ముంబయి ఇండియన్స్‌కు వాంఖడేలో మ్యాచులు పెట్టడం న్యాయం కాదు. కొన్నేళ్లుగా వాంఖడే వారికి సొంత మైదానంగా ఉంది. మిగతా ఫ్రాంచైజీలన్నీ దీనిని లేవనెత్తాయి. ముంబయి ఇండియన్స్ అన్ని మ్యాచులను డీవై పాటిల్ లేదా పుణెలో ఆడితే తమకేం అభ్యంతరం లేదని అంటున్నాయి. బ్రబౌర్న్ అయినా ఫర్వాలేదంటున్నాయి. బీసీసీఐ ఈ అంశాన్ని పరీశీలిస్తుందనే అనుకుంటున్నాం' అని ఓ ఫ్రాంచైజీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
మహారాష్ట్రలో మ్యాచులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటి వరకు అధికారికంగా వేదికలను ప్రకటించలేదు. అన్నీ పరిశీలించి, అందరి సందేహాలను నివృత్తి చేశాకే ముందుకెళ్లొచ్చని తెలుస్తోంది.